హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను ఉపయోగించుకుంటోందని మంత్రి వివేక్ ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఓటు చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని మంత్రి వివేక్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు.
మందమర్రిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఆయన.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు మంత్రి వివేక్ తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.సింగరేణి ప్రాంతంలో కొత్త గనులు ఏర్పాటు చేస్తే స్థానికంగా అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని మంత్రి అన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రస్తుత 70 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నులకు పెంచాలంటే కొత్త గనులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. గృహాల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు.GO 76పై ఉన్న స్టేను ఎత్తివేసే అంశంపై ఇటీవల జరిగిన సబ్‌కమిటీ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని మంత్రి ఆరోపించారు.
సింగరేణి సంస్థకు కొత్త గనులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా సింగరేణికి కొత్త గనులు రాలేదని ఆయన ఆరోపించారు.సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఉత్పత్తిని పెంచేందుకు కొత్త గనుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కోసం కూడా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
