- అందుకే ఇంటర్ విద్యార్థుల మరణాలపై
- నోరు మెదపలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
- ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ కరెక్ట్ కాదు
- నిరసన చేస్తే రాహుల్, ప్రియాంక, ఖర్గేను అరెస్ట్ చేయడమేంది?
- పోలీసుల చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపాటు
- ఢిల్లీలో ఖర్గేతోపాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలతో భేటీ
హైదరాబాద్, వెలుగు: గ్లోబరీనా సంస్థతో సంబంధాలు ఉన్నందుకే గతంలో ఇంటర్ విద్యార్థుల మరణాలపై కేటీఆర్ స్పందించలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మూడేండ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో గ్లోబరీనా వైఫల్యం వల్ల 18 మంది ఇంటర్ స్టూడెంట్లు బలయ్యారని గుర్తుచేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న కేటీఆర్ బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేదని.. వారికి నష్టపరిహారమూ ఇప్పించలేదని మండిపడ్డారు.
గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మంత్రి వివేక్ కలిశారు. అనంతరం పార్లమెంట్‌లో పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. పీసీసీ నేతృత్వంలో విద్యార్థులకు అండగా నిలుస్తూ.. రాహుల్, ఖర్గే, ఇతర ఎంపీల అరెస్టును ఖండిస్తూ తెలంగాణలో ఆందోళనలు చేపట్టామని వివరించారు. అనంతరం మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ..మంచిర్యాలలో రైతుల కోసం ఆందోళన చేసిన కేటీఆర్.. మరి ఆనాడు ఇంటర్ విద్యార్థుల మరణాలపై ఎందుకు ఒక్క ప్రకటన కూడా చేయలేదని నిలదీశారు. గ్లోబరీనాలో పార్ట్‌నర్‌షిప్ ఉన్నందుకే విద్యార్థుల మరణాలపై నోరు మెదపలేదని ఫైర్ అయ్యారు. గ్లోబరీనాతో సంబంధాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఇప్పుడు కేటీఆర్ తనకేమీ సంబంధం లేదంటూ తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. గ్లోబరీనా వివాదానికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ ఇప్పటికైనా తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు.
రాహుల్, ప్రియాంక, ఖర్గే అరెస్ట్ కరెక్ట్ కాదు
నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాలపై లోక్‌సభలో చర్చ జరపనందుకు ప్రధాని ఇంటి ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదని మంత్రి వివేక్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వారిని టెర్రరిస్టులుగా చూడటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. గతంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా పేపర్ లీకేజీపై నిరసన తెలిపారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే లీకేజీలపై విద్యార్థులు నిరసన చేపడితే, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీచార్జ్ చేయటమేంటని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందిపోయి.. దీనిపై మోదీ ప్రభుత్వం మౌనం వహించి అణచివేత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలను అర్థం చేసుకొని న్యాయం చేయటానికి బదులుగా వారిని పోలీసులతో ఇష్టం వచ్చినట్లు కొట్టించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
