కార్మికక్షేత్రంలో రెండు ప్రభుత్వ ఆస్పత్రులు..మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ

కార్మికక్షేత్రంలో రెండు ప్రభుత్వ ఆస్పత్రులు..మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ
  •     50 పడకల సామర్థ్యంతో మందమర్రి, క్యాతనపల్లిలో ఏర్పాటుకు సన్నాహలు
  •     స్థల సేకరణలో రెవెన్యూ, సింగరేణి శాఖలు
  •     పేదలు, కార్మికేతరులు, రిటైర్డు ఉద్యోగ కుటుంబాలకు  వైద్య సేవలు
  •     మంత్రి ప్రకటనతో ప్రజల హర్షం  

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లోని కార్మికక్షేత్రాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. రెండు చోట్ల 50 పడకల కొత్త ఆస్పత్రులు నిర్మించనున్నట్లు రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి ప్రకటించడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీగా ఏర్పడ్డ క్యాతనపల్లిలో సుమారు 40 ఏండ్లుగా ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో లేవు. రెండు మున్సిపాలిటీల్లో సింగరేణి కార్మిక కుటుంబాలే అత్యధికం కావడంతో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్​లోని ఏరియా ఆస్పత్రి, మందమర్రిలోని కేకే1 డిస్పెన్సరీల ద్వారానే వైద్య సేవలు అందుతున్నాయి. కార్మికేతరులు, రిటైర్డ్ ఉద్యోగులు, పేద ప్రజలు చిన్నపాటి వైద్యానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం

ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం సందర్భంగా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో 50 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఆస్పత్రుల ఏర్పాటుపై ఇటీవల సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్​జ్యోతి, డైరెక్టర్​ గౌతం పోట్రుతో మంత్రి చర్చించారు. అవసరమైన స్థలాల పరిశీలన, సీఎస్​ఆర్ నిధులు కేటాయించాలని మంత్రి చేసిన సూచనకు సింగరేణి సీఎండీ అంగీకరించారు. మంత్రి ఆదేశాలతో ఈనెల 17న కలెక్టర్ కుమార్​ దీపక్​ తోపాటు మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ, తహసీల్దార్​సతీశ్, అధికారులు, సింగరేణి ఎస్టేట్​సిబ్బంది క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్​కార్మిక క్షేత్రంలో స్థలాలను పరిశీలించారు. 

మందమర్రి పాత బస్టాండ్​ ప్రాంతంలో ఉన్న పీహెచ్​సీ ఆవరణలో మరో ఆస్పత్రి ఏర్పాటుకు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో మంత్రి వివేక్​ గురువారం పీహెచ్​సీని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలోని ఖాళీ స్థలం 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి అనుకూలమైనదిగా సూచించారు. 

అందుబాటులోకి అన్ని వైద్య సేవలు

మందమర్రి మున్సిపాలిటీ, రూరల్​ ప్రాంతాల్లో సుమారు 1.20 లక్షల మంది జనాభా ఉంటుంది. వీరంతా ప్రస్తుతం మందమర్రిలో ప్రైమరీ, అర్బన్​హెల్త్​ సెంటర్ల ద్వారానే ప్రాథమిక వైద్యం పొందుతున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 వేల మంది జనాభా ఉండగా.. ఇక్కడా సరైన వైద్య సదుపాయాలు లేవు. ఈ రెండు ప్రాంతాల్లో 50 పడకల ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే స్పెషలిస్టు, అత్యవసర సేవలు అందనున్నాయి. ఇన్​ పేషెంట్, అత్యవసర, ట్రామా, మాతాశిశు సంరక్షణ, సాధారణ ఆపరేషన్లు, ల్యాబ్, డయాగ్నస్టిక్ ​సేవలు, టీకాలు, కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులోకి వస్తాయి. పేదలు, బడుగు, బలహీనవర్గాలకు 24 గంటల పాటు  మెరుగైన వైద్యం అందనుంది.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం 
చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తా. త్వరలో చెన్నూరులో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో 50 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నా. స్థలాలు ఇవ్వాలని, సీఎస్ఆర్ నిధుల కేటాయించాలని సింగరేణి సీఎండీ, డైరెక్టర్​ను కోరితే ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. మందమర్రి మండల ప్రజలకు గిఫ్ట్​గా ఆస్పత్రులను అందిస్తా.- మంత్రి వివేక్ ​వెంకటస్వామి