- రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- చెన్నూరు, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో ప్రచారం
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. చెన్నూరు నియోకవర్గంలోని మండలాల పరిధిలోని పంచాయతీల్లో కాంగ్రెస్బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల తరఫున సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
తెల్లవారుజామున 6 గంటల నుంచే మంత్రి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి అభ్యర్తులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను ప్రజలకు చూపుతూ ఆదరించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టి ప్రజల మౌలిక సౌలత్‌ల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
భీమారం మండలం భీమారం, నర్సింగాపూర్, కాజిపల్లి, దాంపూర్, ధర్మారం, బూరుగుపల్లి పంచాయతీ సర్పంచి అభ్యర్థులు భాగ్యలక్ష్మి, రూప, లక్ష్మి, స్వప్న, సంపత్, మల్లేశ్, జైపూర్మండలంలోని జైపూర్, షెట్పల్లి, కిష్టాపూర్, టేకుమట్ల, ఇందారం, నర్సింగాపూర్, కుందారం, గంగిపల్లి, ముదిగుంట పంచాయతీ అభ్యర్థులు భాస్కర్, సరస్వతి, దుర్గం మహేశ్, వెంకటేశ్, ఫయాజోద్దిన్, రాజన్న, వినోద, రాజేశ్వరి, బత్తుల సుజాతకు మద్దతుగా మంత్రి ప్రచారం చేశారు.
చెన్నూరు మండలం కొమ్మెర, పొక్కూరు, ముత్తరావుపల్లి, దుగ్నేపల్లి, చెల్లాయిపేట, లంబడిపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థులు సమ్మయ్య, ఎ.లక్ష్మి, రాజయ్య, రమేశ్, రాజేశ్వరి, సుభాష్ నాయక్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. మందమర్రి మండలంలోని పంచాయతీ అభ్యర్థులను కలిసిన మంత్రి వారి గెలుపు కోసం కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
