
బీసీ బిల్లు అమలు కాకుండా బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించినా.. 40 రోజుల నుంచి అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ వైఖరి ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
బిల్లు రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కొట్లాడుతోందని అన్నారు మంత్రి వివేక్. పోరాటం ఇలాగే కొనసాగిస్తూ రిజర్వేషన్లు సాధించుకుందామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ కమిట్మెంట్ తో ఉన్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ALSO READ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మా పోరాటం ఆగదు: ఎంపీ వంశీకృష్ణ
రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను మూడు నెలల లోపు ఆమోదం తెలపాలని సుప్రీం కోర్టు గత తీర్పులు ఉన్నాయని అన్నారు మంత్రి. తమిళనాడు రిజర్వేషన్ల అంశంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రిజర్వేషన్లు తగ్గించారని దిగ్విజయ్ సింగ్ స్పష్టం గా చెప్పారని అన్న మంత్రి.. మరోవైపు బీజేపీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకోవాలని సూచిస్తుందని విమర్శించారు.
బీసీ కోటా కోసం అన్ని పార్టీల మద్ధతు కోరామని చెప్పారు మంత్రి వివేక్. గ్రామ గ్రామాన బీసీ కోటా కోసం పబ్లిక్ ఎదురు చూస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేశామని చెప్పారు.