
మంచిర్యాల: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలు అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. యూరియా కోసం బీజేపీ, బీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది గల్లీల్లో కాదని ఢిల్లీలో అని చురకలంటించారు. మంగళవారం (సెప్టెంబర్ 2) మందమర్రి మండలం రామ క్రిష్ణపూర్ RKCOA క్లబ్లో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు మంత్రి వివేక్.
తర్వాత ఫిషరీస్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి 12 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పది ఏండ్ల కాలంలో తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకోవడం, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకోవడం ఒక్కటే బీఆర్ఎస్ లక్ష్యంగా ఉండేదన్నారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో చెన్నూరులో రైతుల పంటలు మునిగిపోతే గత బీఆర్ఎస్ నాయకులు ఏనాడు పట్టించుకోలే విమర్శించారు. కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తరలించారని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని.. అర్హులందరికీ డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మందికి ఇండ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.
►ALSO READ | కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్!? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ?
రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో ప్రతి ఏటా వర్షాకాలంలో చెన్నూరు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వరదలతో నష్టపోయిన రైతులను గుర్తించి వారికి నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫెర్టిలైజర్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.