హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలో ప్రత్యేక కమిటీ: మంత్రి వివేక్ వెంకటస్వామి

హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలో ప్రత్యేక కమిటీ: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గోదాముల నుంచి ‘సెస్’ వసూలు చేసి బోర్డు బలోపేతం
  • రూ. 5 లక్షల ఇందిరా జీవన్ బీమా.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం
  • గుర్తింపు కార్డుల కోసం పేరు నమోదు చేసుకోవాలి 
  • హమాలీలకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు సాధన సమావేశంలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  హమాలీ కార్మికుల చిరకాల కోరిక అయిన ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని నియమించబోతున్నామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి  వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. హైదరాబాద్‌‌‌‌లోని బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌లో జరిగిన హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు సాధనా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, హమాలీ సంఘాల ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, నిపుణులతో కూడిన కమిటీని తక్షణమే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ కార్మికుల కనీస వేతనాలు, గుర్తింపు కార్డులు, బీమా, సామాజిక భద్రత లాంటి అంశాలను సమగ్రంగా స్టడీ చేసి, బోర్డు ఏర్పాటుకు అవసరమైన నివేదికను అందిస్తుందని తెలిపారు. 

గిగ్ వర్కర్ల రక్షణ కోసం ‘గిగ్ వర్కర్స్ యాక్ట్’ తీసుకువచ్చిన విధంగానే హమాలీల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్‌ తెలిపారు. అర్హులైన హమాలీలందరికీ రూ.5 లక్షల ఇందిరా జీవన్ బీమా సౌకర్యం కల్పిస్తామని, అలాగే నివాస స్థలాలు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల ఉచిత వైద్యం అందుబాటులో ఉందని, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్మిక బిడ్డలకు ఉపాధి శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా చూస్తామని స్పష్టం చేశారు. హమాలీలు అందరూ విధిగా గుర్తింపు కార్డుల కొరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

వేతనాలు పెంచేలా ఒప్పించాం

గిగ్ వర్కర్ల బోర్డు తరహాలోనే గోదాముల యజమానులు, అసోసియేట్ల నుంచి ‘సెస్’ రూపంలో నిధులను సేకరించి బోర్డును బలోపేతం చేసేలా యోచిస్తున్నామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల ప్రమాద బీమాతో పాటు, ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.5 లక్షల ఇందిరా జీవన్ బీమా లబ్ధి పొందడానికి హమాలీలందరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు బీమా కంపెనీల నుంచి సహాయం అందక నష్టపోయారని గుర్తుచేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులతో పాటు ఇండ్లు కూడా మంజూరు చేసేలా కలెక్టర్లతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. గతంలో జీతాలు, పెన్షన్లు పెంచితే పరిశ్రమలు నడపలేమని యాజమాన్యాలు (సీఐఐ ప్రతినిధులు) ఆందోళన వ్యక్తం చేసినప్పుడు, కార్మికులు సంతోషంగా ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందని వారికి నచ్చజెప్పి వేతనాలు పెంచేలా చేశామని మంత్రి గుర్తుచేశారు. ఇటీవల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో లారీలను వేగంగా అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హమాలీ కార్మికులు పోషించిన పాత్ర ప్రశంసనీయమని, అందుకే వారికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.

కాకా వెంకటస్వామి ఆశయాల సాధన దిశగా: యూనియన్ ప్రతినిధులు

తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఖలీం భాయ్ మాట్లాడుతూ, 1997 కంటే ముందు ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ గోదాముల్లో కాంట్రాక్టర్ల దోపిడీకి గురైన కార్మికులను ఐక్యం చేసి నిరంతర పోరాటం సాగించామని తెలిపారు. ఆ పోరాటాల ఫలితంగానే అప్పట్లో 27 డిపోలలో హమాలీలకు డైరెక్ట్ పేమెంట్ సిస్టమ్ (డీపీఎస్) కార్మికులుగా గుర్తింపు లభించిందని తెలిపారు. ఇప్పటి వరకు మార్కెట్ యార్డులు, గూడ్స్ షెడ్లు, గోదాములలో వేలాది మంది హమాలీలు కనీస ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులు కూడా లేకుండా అభద్రతా భావంతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే బోర్డు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి, ఏ కాంట్రాక్టర్ వచ్చినా కార్మికుల ఉపాధికి ఢోకా లేకుండా శాశ్వత సామాజిక రక్షణ కల్పించే విధంగా బోర్డు నియమ నిబంధనలు ఉండాలని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ను కోరారు. తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ప్రతినిధి సామ్రాజ్యం మాట్లాడుతూ, కార్మిక సంక్షేమంలో కాకా వెంకటస్వామి చారిత్రక పాత్ర పోషించారన్నారు. అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో పోరాడి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా 1995 పీఎఫ్ చట్టాన్ని తెచ్చిన ఘనత కాకాదేనని కొనియాడారు.  హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి హమాలీ కార్మికుడికి అధికారిక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు.

హమాలీ కాలనీలు రావాలి: ఎమ్మెల్సీ కోదండరాం

ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ, తెల్లవారుజాము నుంచే రక్తాన్ని చెమటగా మార్చి దేశ శ్రేయస్సు కోసం శ్రమించే హమాలీ కార్మికులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమాజ హితం కోరే ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. గతంలో 1950 కాలంలో నెహ్రూ హయాంలో కార్మికుల కోసం కాలనీలు నిర్మించి, వారు చెల్లించే నామమాత్రపు అద్దెనే ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా మార్చి చివరకు ఆ ఇళ్లను వారి సొంతం చేసిన విధానాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో నేటి తెలంగాణ ప్రభుత్వం కూడా హమాలీ కార్మికులకు గృహ సదుపాయం కల్పించి, వారి పిల్లలకు నాణ్యమైన చదువు, వైద్యం అందించేలా బోర్డు ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు.