
హైదరాబాద్: సీఎంతో మీటింగ్ ఉందని కానీ తనకు పబ్లిక్ ముఖ్యమని, ప్రజల కోసం తాను వచ్చానని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పర్యటనలో మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. షేక్ పేట్ పరిధిలోని మారుతినగర్, వినోభా నగర్, షేక్ పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్, సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందిరా గాంధీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫ్లోరింగ్ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ సర్కిల్-18లో అన్నీ కలిపి కోటీ 19 లక్షల రూపాయల పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసులు వారి సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మారుతీ నగర్ వాసుల సమస్యలు పరిష్కరిస్తానని, 40 కోట్ల పనులు మంజూరయ్యాయని చెప్పారు. సెప్టెంబర్ 4వ తేదీ లోపు టెండర్లు కూడా పూర్తవుతాయని తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా చోట్ల హై టెన్షన్ వైర్ల సమస్య ఉందని, దానిపై దృష్టి పెట్టామని చెప్పారు. అంబేద్కర్ నగర్ స్మశానవాటికకు 50 లక్షలు మంజూరు చేశామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని, వాటిని తొలగించాలని ఆయన అధికారులకు సూచన చేశారు. స్థానికంగా ఎవరు ఉంటున్నారో అనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు.
దొంగ ఓట్లను తొలగించే బాధ్యత అందరిదని, నియోజకవర్గ ఇంచార్జ్గా తన పని చేస్తున్నానని, మీరు కూడా కష్టపడి పని చేయాలని కేడర్కు పిలుపునిచ్చారు. ప్రజల ప్రేమ కంటే ఏదీ గొప్ప కాదని, అందుకే తాను ప్రజల మధ్య ఉంటానని తెలిపారు. రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులను మంత్రి వివేక్ వెంకట స్వామి అభ్యర్థించారు.