తీరనున్న కష్టాలు.. భీమారం మండలంలో అందుబాటులోకి వైద్యం

తీరనున్న కష్టాలు..  భీమారం మండలంలో అందుబాటులోకి వైద్యం
  • మంత్రి వివేక్​చొరవతో పీహెచ్​పీ ఏర్పాటు
  • 11 పంచాయతీల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు 
  • పదేండ్లు పట్టించుకోని బీఆర్ఎస్
  • నేడు ప్రారంభించనున్న మంత్రి

కోల్​బెల్ట్​/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకాలం పాటు మండలంలోని 11 పంచాయతీల ప్రజలకు వైద్య సేవలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాలం ఏదైనా వైద్యం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సమీప మండల కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి. సకాలం వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. 

భీమారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్​సీ) ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్​పాలకులకు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఎట్టకేలాకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవతో వైద్య సేవలు  అందుబాటులోకి రానున్నాయి. భీమారంలో పీహెచ్​సీ ప్రారంభానికి 
రెడీ అయ్యింది.

మండల కేంద్రంలో వైద్య సేవ

భీమారం మండలంలోని 14 గ్రామాల్లో 15 వేలకు పైగా జనాభా ఉంది. కానీ మండల ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు లేకపోవడంతో 10 నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించి జైపూర్, చెన్నూరు మండల కేంద్రాల్లోని సర్కార్​ దవాఖానాలకు వెళ్లేవారు. వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో ఇక్కడి ప్రజలు, రైతులు తరచూ పాము కాట్లకు గురయ్యేవారు. సరైన టైమ్​లో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. 

చిన్నపాటి వైద్యం కోసమైనా పదుల కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మండల పరిధిలో భీమారం, దాంపూర్, మద్దికల్​లో సబ్​ సెంటర్లు ఉన్నా పూర్తిస్థాయి వైద్యం అందని పరిస్థితి. దీంతో భీమారంలో పీహెచ్​సీ ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్​ పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా 
పట్టించుకోలేదు.

మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవతో..

వైద్యం కోసం  భీమారం మండల ప్రజలు పడుతున్న కష్టాలను అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్​ వెంకటస్వామి స్వయంగా చూశారు. మండల కేంద్రంలో పాటు ఏ గ్రామానికి వెళ్లినా తమకు వైద్య సేవలు అందుబాటులో లేవని, కనీసం 108 అంబులెన్స్ సర్వీస్ కూడా రాలేని పరిస్థితి ఉందంటూ ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైద్య సౌలత్​లను 
అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన తర్వాత గతేడాది ఆగస్టులో భీమారానికి 108 అంబులెన్స్​సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే నెల 29న రైతు వేదిక పక్కనున్న స్థలంలో రూ.1.43 కోట్లతో పీహెచ్​సీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేయాలని సంబంధిత ఆఫీసర్లు, కాంట్రాక్టర్​ను ఆదేశించారు. దీంతో ఏడాది కాలంలోనే పీహెచ్​సీ భవనం పూర్తయ్యి ప్రారంభానికి రెడీ అయ్యింది. పీహెచ్​సీని సోమవారం మంత్రి వివేక్​ వెంకటస్వామి ప్రారంభించనున్నారు. ఏండ్లకాలంగా సాకారం కాని పీహెచ్​సీ సేవలు మంత్రి చొరవతో కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుండడంతో తమ కష్టాలు తీరాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

పదేండ్లు పట్టించుకోలే..

భీమారం మండల కేంద్రంలో పీహెచ్​సీ ఏర్పాటును అప్పటి బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదు. పదేండ్లు పాలించిన ఎమ్మెల్యే బాల్క సుమన్​కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సహకరించలేదు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వివేక్​వెంకటస్వామి మండల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. 108 అంబులెన్స్​సర్వీస్​ను మంజూరు చేయడంతో పీహెచ్​సీ భవనం పూర్తిచేయించి ప్రజల ఏండ్ల కష్టాలను దూరం చేశారు.  - పొడేటి రవి, భీమారం, కాంగ్రెస్ లీడర్