- బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లూ నిర్మించలేదు
- రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి.. మిత్తీల భారం మోపారు
- ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్స్ నేర్చుకోవాలని సూచన
- పరిగిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన
పరిగి, వెలుగు: పేదల సొంతింటి కల నెరవేరుస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేదలకు నిర్మించి ఇవ్వలేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. వాళ్లు చేసిన అప్పులకు మా ప్రభుత్వం నెలకు రూ.5 వేల కోట్ల మిత్తి చెల్లిస్తున్నది. మేం అధికారంలోకి వచ్చాక విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం. వచ్చే మూడేండ్లలో 17 లక్షల ఇండ్లను నిర్మించేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్‌పరిధిలోని నస్కల్గ్రామంలో రూ.45 కోట్లతో రెండెకరాల్లో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)కు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా టాటా కంపెనీ సహకారంతో రూ.4 వేల కోట్లతో115 అడ్వాన్స్డ్టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. గత బీఆర్ఎస్ప్రభుత్వం ఐటీఐలను పట్టించుకోలేదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు. మేం ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ చేశాం. త్వరలో ఇంకో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అయితే పెరుగుతున్న జనాభాకు అవి సరిపోవు. యువత స్కిల్స్ నేర్చుకోవాలి. ఎక్కడ అవకాశాలు ఉంటే, అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయాలి” అని సూచించారు.
స్కిల్స్‌తోనే జాబ్..
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్లఎకానమీగా మార్చడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని మంత్రి వివేక్ తెలిపారు. ‘‘యువతకు సరైన ఉద్యోగం రావాలంటే సరైన స్కిల్స్ఉండాలి. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పెరగడంతో ఎక్కువ మంది యువత ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అది సరైంది కాదు. నేను పారిశ్రామికవేత్తను. నాకు14 రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను” అని చెప్పారు. ఆరు నెలల్లో మళ్లీ వచ్చి ఏటీసీ వర్క్ ప్రోగ్రెస్‌ను పరిశీస్తానని అన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రాజెక్టులను తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిగికి నేవీ రాడర్, రైల్వే లైన్, 400 కేవీ విద్యుత్‌సబ్‌స్టేషన్,100 బెడ్ల ఆస్పత్రి తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. నస్కల్‌ను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
అభిమాని కారు నడిపిన వివేక్..
వికారాబాద్‌జిల్లా పూడూరు మండలంలోని మంచన్‌పల్లి గ్రామానికి చెందిన భ్యాగరి శ్రీనివాస్ తండ్రి భీమయ్య కొన్ని నెలల కింద మరణించగా.. పరిగి పర్యటలో భాగంగా ఆయనకుటుంబాన్ని మంత్రి వివేక్ పరామర్శించారు. ఈ సందర్భంగా తాను కొనుగోలు చేసిన కొత్త కారును నడిపించాలని వివేక్‌ను శ్రీనివాస్ కోరారు. తన అభిమాని కోరిక మేరకు కారును పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి వరకు వివేక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.
