బీఆర్ఎస్ పని ఖతం..సర్పంచ్ ఎన్నికల్లో మన సత్తా చూపెట్టాలి: మంత్రి వివేక్

బీఆర్ఎస్ పని ఖతం..సర్పంచ్ ఎన్నికల్లో మన సత్తా చూపెట్టాలి: మంత్రి వివేక్

సిద్ధిపేట: రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం అని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గ్రామాల్లో గులాబీ పార్టీ క్యాడర్ను కోల్పోయిందని చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వెల్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన ఇవాళ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ండ్ల పేరు చెప్పి ఆ పార్టీ పదేండ్లు ప్రజలను మభ్య పెట్టిందని ఆరోపించారు. 

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘటన కాంగ్రెస్పార్టీకే దక్కుతుంద న్నారు. సిద్ధిపేట జిల్లాలో 3వేలకు అదనంగా మరో 5 వందల ఇందిరమ్మ ఇండ్లు అవసరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో మనకు పోటీ లేదని, మన పార్టీ వారితో మనకే పోటీ ఉందన్నారు. గజ్వెల్లో సర్పంచ్ లను గెలిపించుకొని కాంగ్రెస్పార్టీ బలంగా ఉందని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయం కోసం అందరూ ఏకదాటిపైకి రావాలని సూచించారు.