కాళేశ్వరంతో ప్రజాధనం వృథా: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరంతో ప్రజాధనం వృథా: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     ఇండ్లు, రేషన్​ కార్డులు ఇవ్వకుండా పదేండ్లు కేసీఆర్ ​మోసం చేసిండు
  •     కాంగ్రెస్‌ వచ్చాకే పేదలకు ఇండ్లు, రేషన్‌ కార్డులు అందుతున్నయ్
  •     రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని వెల్లడి


కోల్‌బెల్ట్‌ / పెద్దపల్లి, వెలుగు:పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్లు వృథా చేశారని గనులు, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు వల్ల పంటలకు చుక్క నీరు కూడా అందలేదన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ శివాజీనగర్‌లో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక స్కూల్‌ను శనివారం మంత్రి వివేక్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లకు స్కూల్‌ బ్యాగ్‌లు, పుస్తకాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాకే పేదలకు రేషన్‌‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్‌‌.. అందరినీ మోసం చేశారని ఫైర్​అయ్యారు. తాము నియోజవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే 10 వేల టీచర్‌‌ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌‌ స్కూల్స్‌‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

అందరికీ విద్య అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కిలోమీటర్‌‌కు ఓ స్కూల్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా మూసేసిన స్కూళ్లను రీ ఓపెన్‌‌ చేస్తున్నామని మంత్రి చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు. అమృత్‌‌ స్కీమ్‌‌ కింద రూ. 40 కోట్లతో క్యాతనపల్లి మున్సిపాలిటీలో తాగునీటి సప్లై కోసం పనులు చేపట్టామని, మరో రూ.20 కోట్లతో రోడ్లు, సైడ్‌‌ డ్రైనేజీల పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్‌‌ను వచ్చే ఎన్నికల్లో సైతం ఆదరించాలని మంత్రి కోరారు. అంతకుముందు రేషన్‌‌ కార్డులు పంపిణీ చేశారు. చెన్నూరులోని జడ్పీ గర్ల్స్​హైస్కూల్‌‌లో లైబ్రరీ బిల్డింగ్‌‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ కుమార్‌‌ దీపక్‌‌, మంచిర్యాల డీసీపీ భాస్కర్, డీఎఫ్‌‌వో శివ్‌‌ ఆశిశ్‌‌ సింగ్‌‌, బెల్లంపల్లి, జైపూర్​ఏసీపీలు రవికుమార్, వెంకటేశ్వర్లు, సీఐ శశిధర్‌‌రెడ్డి, డీఈవో యాదయ్య, మందమర్రి తహసీల్దార్ సతీశ్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్​కమిషనర్లు తుంగపిండి రాజలింగు, గద్దె రాజు పాల్గొన్నారు. 

పదవులు వద్దనుకొని తెలంగాణ కోసం కొట్లాడిన

తాను ఏనాడూ ఎలాంటి పదవులు కోరుకోలేదని, గతంలో మంత్రినయ్యే అవకాశమున్నా వదులుకొని తెలంగాణ సాధన కోసం కొట్లాడానని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ప్రస్తుతం మంత్రిగా కార్మికుల పక్షాన కాకా వెంకటస్వామి ఆశయసాధనకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్ లో​మంత్రి వివేక్​ వెంకటస్వామిని సబ్బండ వర్ణాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి విగ్రహ ఏర్పాటుకు మంత్రి వివేక్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి ప్రాంత ప్రజలను కాకా వెంకటస్వామి గుండెల్లో పెట్టుకున్నారని గుర్తుచేశారు. నిత్యం ప్రజల పక్షాన పోరాడాలని కాకా వెంకటస్వామి తమకు తరచూ చెప్పేవారని.. రేషన్​ కార్డు విధానం కూడా కాకా వెంకటస్వామి ఆలోచనేనని.. ప్రస్తుతం తాను మంత్రిగా రేషన్​కార్డులు అందజేస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇన్నేండ్లుగా తమ కుటుంబంపై జనం ఆదరణ చూపుతున్నారని, ఈ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా తనదైన శైలిలో ప్రజా సమస్యలపై  పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడన్నారు. సింగరేణి రిటైర్డ్  కార్మికుల పింఛన్​ పెంపు కోసం ఎంపీ కృషి చేస్తున్నాడని మంత్రి వివేక్​ తెలిపారు.