రైతులు అధైర్యపడొద్దు.. మొత్తం ధాన్యం కొంటాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రైతులు అధైర్యపడొద్దు..  మొత్తం ధాన్యం కొంటాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     దిగుబడి ఎక్కువ రావడంతో సమస్యలు వచ్చాయ్
  •     సీఎం రేవంత్ రెడ్డి వాటిని పరిష్కరించారని వెల్లడి
  •     గజ్వేల్‌‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

గజ్వేల్, వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌లోని ఐవోసీలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు కొత్తగా నిర్మించిన బస్టాండ్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ యాసంగిలో ధాన్యం దిగుబడి గతం కంటే 30 శాతం ఎక్కువ వచ్చిందని, దీంతో కొనుగోలులో సమస్యలు తలెత్తాయని చెప్పారు. ప్రతిపక్షాలు రైతులను కావాలని భయాందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించారని, చివరి గింజ వరకు కొంటామని భరోసా ఇచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తున్నామని, పేద పిల్లలకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించనున్నట్టు చెప్పారు. జూనియర్​ కాలేజీల స్టూడెంట్లకు కూడా ఈ ఏడాది నుంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తామని వెల్లడించారు. 

గజ్వేల్‌‌లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు..

గజ్వేల్​లో రూ.200 కోట్ల తో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. అలాగే, రాజీవ్ ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ రోగులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అడ్వాన్స్​డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ చదువుకునే పిల్లలకు రూ.2 వేల స్టైపెండ్ ఇప్తామని చెప్పారు. శిక్షణ తర్వాత వారికి ఫారెన్ లాంగ్వేజెస్ నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌తో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని, నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇండ్ల నిర్మాణం స్లాబ్ లెవెల్‌‌కు వచ్చాయని తెలిపారు. వచ్చే నెలలో నియోజకవర్గానికి మరో 2,500 ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డీవో చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.