రైతులను ఆయిల్‌ ‌పామ్‌‌ సాగు వైపు ప్రోత్సహించాలి.. లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

రైతులను ఆయిల్‌ ‌పామ్‌‌ సాగు వైపు ప్రోత్సహించాలి.. లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఎరువుల కొరత రాకుండా  చర్యలు తీసుకోవాలి 
  • సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు
  • ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాల్సిందే: మంత్రి దామోదర
  • సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా సమీక్ష సమావేశం 

సంగారెడ్డి, వెలుగు: ఇండస్ట్రియల్ హబ్ గా వెలుగొందుతున్న సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులను క్రాప్ డైవర్షన్ వైపు ప్రోత్సహిస్తూ.. లాభదాయక పంటలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులకు సరైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాలన్నారు. 

వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో  జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ రంగాల పురోగతిపై  ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ హబ్‌‌గా వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

  • పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలో గతంలో నిర్మించి.. కేటాయించని డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. 

జిల్లాలోని  పాఠశాలల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అవసరమైన మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌‌కు అందజేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. హాస్పిటళ్లు, హోటళ్లు తదితర సంస్థల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించి.. కాలుష్య నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని మంత్రి వివేక్  ఆదేశించారు.

  • అర్హులకు ప్రభుత్వ సేవలు అందాలి

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కచ్చితంగా పేదలకు అందాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని డయాగ్నస్టిక్ పరికరాలు, డ్రగ్స్, అవసరమైన ఇక్యుమెంట్ అందుబాటులో ఉంచాలన్నారు. నర్సింగ్ వృత్తికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్నందున గ్రామీణ ప్రాంత యువతులను నర్సింగ్ కోర్సులు అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. 

అనంతరం ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పలు సమస్యలను మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.