ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి.. గ్రేడ్-ఏ రకానికి క్వింటాలుకు రూ.8 వేల100 చొప్పున కేంద్రం ధర నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య, అధికారులను ఆదేశించారు.
గత సంవత్సరం ఇక్కడ పత్తి కొనుగోలు గడువును పెంచాలని ఎంపీ వంశీకృష్ణ కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. గత ఏడాదిలాగే ఈ సారి కూడా నెల రోజుల గడువు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మాట్లాడి పత్తి ఎకరాకు 12 క్వాంటాళ్లు కొనాలని కొరతానని అన్నారు. అదే క్రమంలో కేంద్రాన్ని ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసేలా ఎంపీ వంశీ ఒత్తిడి తీసుకొస్తారని అన్నారు.
రాష్ట్రంలో వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు మంత్రి వివేక్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకున్నా ఇంత పెద్ద ఎత్తున పంటలు పండించి రైతులు రికార్డు సృస్టించారని అభినందించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని తెలిపారు. దేశంలో కొత్తగా మొదటి సారి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘన కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు.
