
బషీర్బాగ్, వెలుగు: సమాజంలో కల్చర్ అనేది ప్రతి అంశంలో చాలా ముఖ్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రవీంద్ర భారతిలో కళాకృతి నృత్యాలయ సమర్పిస్తున్న.. యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ రెండో రోజు ముగింపు ఉత్సవాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన నాట్య కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని మంత్రి తెలిపారు. కాలక్రీతి నృత్యాలయ ఆధ్వర్యంలో యాదాద్రి జాతీయ నృత్య పండుగ నిర్వహించిన.. కళాకృతి నృత్యాలయ ఫౌండర్ డైరెక్టర్ ఎం.భారతిని మంత్రి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాట్యాంజలి పోటీల్లో దేశంలోని ప్రతిష్టాత్మక కళాశాలల విద్యార్థులు, యువ నర్తకులు పాల్గొనడం విశేషమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన వీ6 చానెల్ తెలంగాణ కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేలా చానెల్ లో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగలు బోనాలు, బతుకమ్మ పండుగల సంస్కృతిని ప్రజలకు తెలియజేసేలా వీ6 చానెల్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేశామన్నారు. కాలక్రీతి నృత్యాలయ యాదాద్రి జీవిత కాల నృత్యాలయ 2025 అవార్డును కళాకృష్ణ, ఉమా మహేశ్వరి దంపతులకు మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు. అలాగే, ప్రఖ్యాతి చెందిన కళాకారులకు, యువ ప్రతిభావంతులకు యాదాద్రి నాట్య పురస్కారాలు అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.