
హైదరాబాద్: సింగరేణి సంస్థకు లాభాలే కాదు.. కార్మికుల ప్రాణాలు కూడా ముఖ్యమేనని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి ఏరియా KK5 గనిలో శుక్రవారం (ఆగస్ట్ 1) రాత్రి మృతి చెందిన కార్మికుడు రాసపెల్లి శ్రావణ్ కుమార్ భౌతికాయానికి మంత్రి వివేక్ నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు సింగరేణి సంస్థ నుంచి అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం KK5 గనిని సందర్శించి ప్రమాదం జరిగిన తీరు, గని లోపల రక్షణ ఏర్పాట్ల గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సింగరేణి జీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్మికుల రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని అధికారులకు సూచించారు. ఎస్డీఎల్ యంత్రం చెడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందని.. సింగరేణిలో కాలం చెల్లిన యంత్రాల గుర్తించి వాటి స్థానంలో కొత్తవి తీసుకురావాలని చెప్పారు. గని ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎండీని ఆదేశించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, సింగరేణి అధికారులతో కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.