తెలంగాణమే తపన..16 ఏండ్ల రాజకీయం తెరిచిన పుస్తకమే!

తెలంగాణమే తపన..16 ఏండ్ల రాజకీయం తెరిచిన పుస్తకమే!

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఒకనాడు కల. ఆ కలను సాకారం చేయడంలో  ప్రజా ఉద్యమం  ఎంత అవసరమో, రాజకీయ పోరాటమూ అంతే అవసరమైంది. దేన్నైనా తేల్చేది రాజకీయ నిర్ణయమే. కాబట్టి ఆ నిర్ణయం జరగాలంటే అది ఆషామాషీ విషయం కాదు​.  టీఆర్​ఎస్​ అనే ఉద్యమ పార్టీ ఉన్నా.. కేంద్రంపై ఒత్తిడి పెంచడం ఆ పార్టీకి అసాధ్యమైన పని. బలిదానాలను భరించలేని ఉద్యమం సకల జనుల సమ్మె గా మారింది. కానీ రాజకీయ నిర్ణయం కోసం ఒత్తిడి తేవడం అత్యంత కీలకంగా మారిన కాలమది. ఆనాడు అధికార పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్​ ఎంపీలే తెలంగాణ కోసం పార్టీపైనే తిరగబడి పోరాడడం ఒక పెద్ద మలుపు. 

కాంగ్రెస్​ అధిష్టానంపై సీమాంధ్ర ఎంపీల ఒత్తిడి ఎంత ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్​ ఎంపీల ఒత్తిడే  పైచేయి సాధించిందనడంలో సందేహం లేదు. ఆనాటి పది మంది కాంగ్రెస్​ ఎంపీల పోరాటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. రాష్ట్రంలో అదే కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉండడం.. తెలంగాణకు చెందిన ఒక్క కాంగ్రెస్​ మంత్రి కూడా తెలంగాణ గొంతు బలంగా వినిపించకపోవడం ( ఒక్క కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి మాత్రమే మంత్రి పదవికి రాజీనామా చేశారు) చూస్తే.. ఆనాడు తెలంగాణ కోసం తిరగబడి పోరాడిన ఎంపీలు ఎంత గొప్పవారో ఎవరికైనా అర్థమయ్యే విషయం.  

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీ  దశాబ్దకాలం తర్వాత  అధికారంలోకి రాగలిగింది. కానీ నాడు తెలంగాణ కోసం పోరాట పటిమ చూపిన వారిని ఆదరించాల్సిన అవసరం, వారి సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం రేవంత్​ ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగా చూస్తే.. ఇవాళ వివేక్​  వెంకటస్వామిని మంత్రివర్గంలోకి తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం.

పబ్లిక్​ రిలేషనే ఆయన లైఫ్​స్టైల్​ 

వివేక్ ఒక పారిశ్రామిక వేత్త. సుఖసౌకర్యాలు ఎన్నిఉన్నా  ఆయనకు ప్రజల్లో జీవించాలని, ప్రజల్లోనే తిరగాలనే  హాబీ  ఉండటం.. ఒక అరుదైన లక్షణం.  పారిశ్రామిక వేత్తగా కన్నా, ప్రజాజీవితాన్నే ప్రేమించడం ఆయనలో ఉన్న  లక్షణంగా మనకు కనిపిస్తున్నది. అది వారి  తండ్రి కాకా వెంకటస్వామితో అబ్బిన లక్షణమని చెప్పొచ్చు. 

రాజకీయాల్లో పనిని ఆస్వాదించడం ఆయనలో ఉన్న ఆరో లక్షణం. ప్రజలు కోరుకునే  అన్ని లక్షణాలు ఆయనలో మనకు కనిపిస్తాయి.    ప్రజల సమస్యలను అదేపనిగా  పట్టించుకొని తిరగడం అనేది సహజంగానే చాలా మంది  నాయకులకు  చికాకు గొలిపే విషయం. కానీ వివేక్​ది​ అందుకు భిన్నమైన వ్యక్తిత్వం. ఆయన లైఫ్​స్టైల్​ అలాంటిది. ప్రజా సంబంధాలను హాబీగా మార్చుకునే వారు చాలా  అరుదు. కానీ ప్రజాసంబంధాల్లోనే జీవించాలనే లక్షణం వివేక్​లో కనిపిస్తుందని ఆయన పొలిటికల్​ కెరీర్​ చెపుతుంది.

16 ఏండ్ల రాజకీయం తెరిచిన పుస్తకమే!

వివేక్​ రాజకీయాల్లోకి రాకముందే పారిశ్రామిక వేత్త. ఆయనేమీ రాజకీయాల్లోకి వచ్చి పారిశ్రామికవేత్త కాలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే!  రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా  సంపద కోసమే వస్తారని అనుమానించే ఈకాలంలో.. 16 ఏండ్ల వివేక్​ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదే. 2009 నుంచి 14 వరకు ఎంపీగా కొనసాగినా  తెలంగాణ ఉద్యమకారుడిగానే కాలం గడిచిపోయింది. మిగతా కాలమంతా కేసీఆర్​ నియంతృత్వ పోకడలపై, కేసీఆర్​ అవినీతి పాలనపై బీజేపీ దర్యాప్తులు జరుపుతుందని  నమ్మడంతోనే సరిపోయింది. కాబట్టి ఆయన పదవుల కోసమో, సంపద కోసమో, రాజకీయాల్లో కొనసాగలేదని 16 ఏండ్ల ఆయన రాజకీయ జీవితమే సాక్ష్యం!. 

హ్యూమన్​ క్యారెక్టర్​!

కొందరిని పార్టీలే ఆహ్వానిస్తాయి. అలాంటి కోవకు చెందిన వ్యక్తే వివేక్​. నిజానికి క్రెడిబిలిటీ ఉన్న నేతలను పార్టీలే వెదుకుతుంటాయి. వివేక్​ అన్నిటికి మించి ప్రజా సంబంధాలను ప్రేమించే వ్యక్తి.  అంతకన్నా మించి తెలంగాణవాదాన్ని సదా ప్రేమించే వ్యక్తి. ఆయన వ్యక్తిత్వంలోనే  తెలంగాణ వాదం ఉంది. మృదుస్వభావం. ఆప్యాయ పలకరింపు, వివేక్​ వాడే  ‘కైసా హై భాయ్’  లాంటి హైదరాబాదీ భాష​  ఆయన వ్యక్తిత్వానికే ఒక గుర్తింపును తెచ్చింది.  ఆయనలో ఉన్న తెలంగాణ హ్యూమన్​ క్యారెక్టరే ఆయన్ను ఇవాళ మంత్రిని చేసిందని చెప్పొచ్చు!

మంత్రిగా సమర్థతే గీటురాయి కావాలె!

ఇపుడు తెలంగాణ రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయంగా ఒక తెలంగాణవాదికి మంత్రి పదవి దొరికిందని చెప్పొచ్చు. ఆయనకు  ముఖ్యమంత్రి ఏ పని అప్పజెప్పినా ఆ పనికి మంచి పేరు తెస్తాననే ధీమా ఆయన మాటల్లో కనిపించింది. మంత్రిగా ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పని చేయడమే తన లక్ష్యమని చెప్పారు.  

ఆయన రాజకీయ జీవితంలో మొదటిసారి మంత్రి అయ్యారు. పరిపాలనలో తన సమర్థతను చాటుకునే అవకాశం ఆయనకు దక్కింది. వివేక్​ తండ్రి  కాకా వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక అత్యున్నత శాఖలను నిర్వహించారు. ప్రజలు మర్చిపోలేని నేతగా నిలిచిపోయారు. కార్మికులకు బోనస్​ ఇప్పించిన మంత్రిగా కాకాకు దేశంలోనే పేరుంది. 

దారిద్ర్యరేఖ దిగువ ఉన్న పేదలకు రేషన్​ షాప్​లను తెరిపించిన  చరిత్ర  కాకాది. అలాంటి కాంగ్రెస్​ వెటరన్​ లీడర్​ కాకా వెంకటస్వామి స్వయాన తెలంగాణ వాది. తండ్రి నుంచి వివేక్​కు రాజకీయ వారసత్వంగా లభించింది  తెలంగాణవాదమే!  రాజకీయంగా తండ్రి అడుగు జాడల్లో నడిచే కొడుకుగా వివేక్​ ఒక సమర్థ మంత్రిగా పనిచేస్తారని ఆశిద్దాం. మంత్రిగా తన నిర్ణయాల్లో అడుగడుగునా తెలంగాణవాదం కనిపించాలని కోరుకుందాం!

దక్కిన గౌరవమెంత?

పొద్దున లేస్తే, ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం, ఆంధ్రా పారిశ్రామిక వేత్తల కోసం పనిచేసే పాలకులను చూశాం. తెలంగాణ వస్తే అన్ని రంగాల్లో  తెలంగాణ వాళ్లు ఎదిగివస్తారనుకున్నాం. కానీ అది జరగలేదు.  తెలంగాణ కోసం పోరాడిన వివేక్​ లాంటి  పారిశ్రామికవేత్తను చూశాం. కానీ తెలంగాణలో వివేక్​ లాంటి అరుదైన పారిశ్రామికవేత్తకు తెలంగాణలో దక్కిన గౌరవం ఎంత? వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్త ఆయన. అందుకే ఆయన తెలంగాణ గర్వించదగ్గ నేత. ఇకపై తెలంగాణ గర్వించదగ్గ మంత్రిగా పనిచేస్తారని ఆశిద్దాం!

తెలంగాణకు ఆయనొక అసెట్​

తెలంగాణ ఉద్యమానికి గొంతులేని నాడు వీ6 చానెల్​ స్థాపించి బలమైన గొంతు వినిపించారు.   తెలంగాణ సాధన కోసం స్వయాన తానే ఒక మీడియా సంస్థ స్థాపించారు. వీ6 చానెల్​, వెలుగు దినపత్రిక ఇప్పటికీ తెలంగాణ వార్తలకు మాత్రమే 75 శాతం ప్రాధాన్యమిస్తున్నాయి. అవి తెలంగాణ ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని తన మీడియా సంస్థల​ ద్వారా ఎలుగెత్తి కాపాడుతున్న అరుదైన తెలంగాణవాది ఆయన. తెలంగాణకు నిజంగా ఆయనొక (ఆస్తి) అసెట్.

పార్టీకన్నా, లక్ష్యం కోసం రాజకీయాల్లో కొనసాగే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. పార్టీలే మాట తప్పితే పార్టీ మారడం వేరు. తెలంగాణపై కుప్పిగంతులు వేసిన పార్టీలెన్నో ఉన్నాయి. ఉద్యమకాలంలో తన పార్టీ(కాంగ్రెస్​)ని ఎదిరించి పోరాడిన చరిత్ర వివేక్​ గారిది. టీఆర్​ఎస్​  అప్రజాస్వామిక పోకడలను ప్రజలు ఎలా సహించలేకపోయారో, తెలంగాణవాదిగా వివేక్​ కూడా అలాగే సహించలేకపోయారనేది గమనించాలి. 

బీజేపీ అయితేనే.. కేసీఆర్​ అవినీతి నుంచి తెలంగాణను కాపాడగలదనే నమ్మకంతో ఆ పార్టీలో మూడేండ్లు ఆయన  కొనసాగారని చెప్పొచ్చు. కానీ  కేసీఆర్​ అవినీతి, కుటుంబ పాలనపై బీజేపీ అరుపులు చేయడం తప్ప, దర్యాప్తులు చేయకపోవడం చూశాకే ఆయన బీజేపీని వీడారనడంలో సందేహంలేదు. మొత్తంమీద వివేక్​ రాజకీయం తెలంగాణ వాదం చుట్టే తిరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన రాజకీయ నిర్ణయం తెలంగాణ వాదంవైపే నిలిచిందనేది వాస్తవం!  ఆయన ఏ పార్టీలో ఉన్నా తెలంగాణవాదిగానే నిలిచారు! 


- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
పొలిటికల్​ ఎనలిస్ట్​