
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైల్వేపోలీసు బలగాల కాల్పుల్లో ఒకరి మృతి చెందడం, పలువురికి గాయాలవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మొన్న కిసాన్ ను, నేడు జవాన్ ను రోడ్డు మీద పడేసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదే అంటూ మండిపడ్డారు. ఓ వైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతూ.. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి, లక్షల కోట్లు ఆదాయం పొందుతున్న కేంద్రం.. దేశ రక్షణను గాలికి వదిలేసి ఖర్చుకు వెనుకాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అగ్నిపథ్ పథకం’ తీసుకొచ్చి దేశ రక్షణ కోసం తమ సేవలు అందించాలనుకునే యువతను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను, దేశానికి రక్షణగా నిలిచే సైనికులను నిర్లక్ష్యంగా చూడటం బాధాకరమన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై టీఆర్ ఎస్ హస్తం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించడాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే బీజేపీ నిర్ణయాల వల్ల నేడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు కనిపించడం లేవా..? అన్ని ప్రశ్నించారు. బండి సంజయ్ లాంటి నాయకులు యువతను రెచ్చగొట్టడం వల్లే దేశంలో అశాంతి, అభద్రత భావం నెలకొందని ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న యువకులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తులకు ఎవరూ నష్టం కలిగించవద్దని కోరారు. నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్ల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, సత్వరమే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.