- నియోజకవర్గాల్లో రహస్యంగా మంతనాలు
- సన్నిహిత నేతలతో కలిసి బుజ్జగింపులు
- అన్నీ చూసుకుంటాం.. జల్ది చేరాలని సూచనలు
- ఓ ఎమ్మెల్యే ఆడియో తమ వద్ద ఉందంటున్న కార్మిక నేతలు
హైదరాబాద్, వెలుగు: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో చేర్చించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు తెలిసింది. తమ నియోజకవర్గం పరిధిలోని డిపోలకు చెందిన కార్మికులతో మాట్లాడి విధుల్లో చేరేలా ఒప్పించాలని ప్రగతిభవన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా కార్మికులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మరికొందరు కార్మికుల వద్దకు తమ సన్నిహిత నాయకులను పంపించి బుజ్జగిస్తున్నట్టు సమాచారం. ‘సమ్మె విషయంలో సీఎం వైఖరి మారదు. ఎందుకు మొండిగా ఉంటారు. జీతం లేకుండా ఎంత కాలం ఉంటారు’అని నచ్చచెపుతున్నారని తెలుస్తోంది.
రహస్యంగా మంతనాలు
ఉత్తర, దక్షిణ తెలంగాణలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులతో రహస్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి తన జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారని తెలిసింది. యూనియన్ నేతపై హైదరాబాద్ లోని ఓ డ్రైవర్ కేసు పెడుతుంటే మీరేం చేస్తున్నారని ఫోన్ చేసి ప్రశ్నించినట్టు సమాచారం. మరో ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గం పరిధిలోని డిపో యూనియన్ నేతలకు ఫోన్ చేసి ‘ఏమైందన్న ఎప్పుడు డ్యూటీలో చేరుతరు. జల్దీ చేరండి. అన్ని మేం చూసుకుంటం. ఏం కాదు’అని బుజ్జగించే ప్రయత్నం చేయగా.. ఓ యూనియన్ నాయకుడు ‘అన్నా.. సోమవారం కోర్టులో కేసు ఉంది కదా.. కోర్టు ఏం చెపుతుందో చూసి చాలా మంది డ్యూటీలోకి వస్తామన్నా’అని జవాబు ఇచ్చినట్టు తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఓ ఎమ్మెల్యే ఆర్టీసీ కార్మికులతో మాట్లాడిన ఆడియో తమ వద్ద ఉందని, డ్యూటీలో చేరాలని ఆ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని ఓ ఆర్టీసీ కార్మిక నాయకుడు చెప్పారు.
కార్మికులు వస్తే చేర్చుకుంటాం
డ్యూటీలోకి వస్తామంటూ ఎవరైనా కార్మికులు వస్తే విధుల్లోకి చేర్చుకోవాలని మౌఖిక అదేశాలు ఇచ్చామని రవాణా శాఖలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ‘మేము ఒకవైపు చర్చలు జరుపుతాం. మరోవైపు కార్మికులను చేర్చుకుంటాం. సోమవారం కల్లా పరిస్థితి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటది’అని ఆ అధికారి వివరించారు. సమ్మె చేస్తోన్న కార్మికుల్లో 70 శాతం మంది విధుల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సోమవారం నాటికి మెజార్టీ కార్మికులు డ్యూటీలో చేరుతారని చెప్పారు.
కార్మికులు ఏం అంటున్రు
ఆర్టీసీ సమ్మెపై తాజాగా తాను చేసిన ప్రకటన తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమిటో రిపోర్ట్ ఇవ్వమని నిఘా వర్గాలను సీఎం అడిగినట్టు తెలిసింది. సీఎం ప్రకటన తర్వాత చాలా మంది కార్మికులు గుర్రుగా ఉన్నారని, శాపనార్థాలు పెడుతున్నారని నిఘా అధికారులు చెప్పినట్టు సమాచారం. ఒక్కోక్కరికీ నెలకు 50 వేల జీతం ఉందంటూ కేసీఆర్ చేసిన ప్రకటనపై కార్మికుల కుటుంబాలు కోపంగా ఉన్నాయని అన్నట్టు తెలిసింది. ఇక ప్రజలు కూడా సీఎం ప్రకటనపై విమర్శలు చేస్తున్నారని, కేసీఆర్ అంత మొండిగా మాట్లాడ్డం సరికాదని మెజార్టీ మంది అభిప్రాయపడ్డారని చెప్పినట్టు సమాచారం.

