త్వరలో పోడు భూములకు పట్టాలిస్తం: మంత్రి సత్యవతి

త్వరలో పోడు భూములకు పట్టాలిస్తం: మంత్రి సత్యవతి

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పోడు భూములకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టాలు పంపిణీ చేస్తారని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా మంత్రులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన దర్బార్ నిర్వమించారు. అంతకుముందు నాగోబా ఆలయ అభివృద్ధి కోసం రూ.50 లక్షల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. 

నివేదిక అందజేశాం :  సత్యవతి రాథోడ్

పోడు భూములపై కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేశామని, ఎక్కువ మందికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే పట్టాలివ్వడంలో ఆలస్యమవుతోందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. త్వరలోనే సీఎం పట్టాలిస్తారని ప్రకటించారు. జీఓ 3ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినట్లు తెలిపారు. ములుగు జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతోనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. విభజన చట్టంలో గత కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీపై హామీ ఇచ్చిందని, అందులో భాగంగానే ములుగులో 300 ఎకరాలు కేటాయించామన్నారు. అయినా ఇప్పటి కేంద్ర సర్కారు స్పందించడం  లేదన్నారు. త్వరలో ఇక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. రూ.12.50 కోట్లతో జోడేఘాట్, కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధి చేస్తామన్నారు.  

ఆలయాభివృద్ధికి రూ. 15 కోట్లు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

ప్రభుత్వం ఇప్పటి వరకు నాగోబా ఆలయ అభివృద్ధికి రూ. 15 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గత దర్బార్లలో ఎన్నో సమస్యలతో ఫిర్యాదుల సంచులు నిండేవని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తుండటంతో సమస్యలే రావడం లేదన్నారు. కేంద్ర మంత్రి వచ్చినప్పటికీ బీజేపీ నేతలు నాగోబా ఆలయానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేదన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, కనీసం దర్బార్ కు వచ్చే సమయం కూడా ఆయనకు లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేఖనాయక్, రాథోడ్ బాపురావు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ జడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్​పర్సన్​ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తం రెడ్డి, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా, డీసీసీబీ చైర్మన్​అడ్డి భోజారెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీ బాయి, మెస్రం వంశం పెద్ద వెంకట్రావ్, చైర్మన్​ తుకారాం, మాజీ ఎంపీ గొడం నగేశ్, ఇంద్రవెల్లి జడ్పీటీసీ పుష్పలత పాల్గొన్నారు.  .  

మళ్లీ పోరాటం చేసేదాకా చూడొద్దు

పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని, కుమ్రం భీం లెక్క మళ్లీ పోరాటం చేసే పరిస్థితి రానివ్వొద్దని గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. దర్బార్ లో పలువురు గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, లిఫ్ట్​ ఇరిగేషన్లు, పైప్ లు వంటివి వ్యవసాయానికి ఇచ్చేవారని, ఇప్పుడు రైతుబంధు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. గిరిజన యూనివర్సిటీ ఉట్నూర్ లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయంలో పూజలు చేసే 23 మెస్రం కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు  కేటాయించాలన్నారు. గిరిజనుల పొలాల్లో ఒకటి రెండు గంజాయి మొక్కలు కనిపించినా రైతు బంధు కట్ చేస్తున్నారని, కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. అదే ఫారెస్టోళ్లు అవినీతికి పాల్పడితే ఆరు నెలల్లోనే మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జీఓ నంబర్​3ను పునరుద్ధరించాలని దర్బార్ సభలో గిరిజన టీచర్లు ఫ్లెక్సీ  ప్రదర్శించారు.