
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చరిత్రలోనే బీసీ సంక్షేమ శాఖకు కేసీఆర్సర్కారు అత్యధికంగా రూ.6,229 కోట్లను బడ్జెట్లో కేటాయించిందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎనిమిదిన్నరేండ్లలో బీసీల కోసం రూ.48 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం 9 ఏండ్లకు రూ.2,037 కోట్లు కేటాయిస్తే.. ఆ తర్వాత కాంగ్రెస్హయాంలో ఏనాడూ రూ.వెయ్యి కోట్లు మించలేదని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని కోకాపేటలో బీసీ ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. ఆరెకటిక, గాండ్ల కులాలకు చెరో ఎకరం, రంగ్రేజ్, భట్రాజ్ కులాలకు 20 గుంటల చొప్పున భూములను కేటాయించారు. శంకుస్థాపన తర్వాత నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కోకాపేట, ఉప్పల్భగాయత్లలో ఆత్మగౌరవ భవనాల కోసం ప్రభుత్వం ఖరీదైన భూములిచ్చిందన్నారు. 41 బీసీ కులాలకు రూ.95.25 కోట్ల విలువైన 87.3 ఎకరాల భూములు కేటాయించారని తెలిపారు.
ఏ సర్కారూ బీసీల అవసరాలు తీర్చలే
బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, వారి అవసరాలను ఏ ప్రభుత్వమూ తీర్చలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హెచ్ఎండీఏ వేలంలో కొద్ది రోజుల క్రితమే కోకాపేటలో ఎకరం రూ.85 కోట్లు పలికిందని, ఈ విషయాన్ని కేసీఆర్‌కు చెప్తే.. బీసీల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారన్నారు. కోట్ల నిధులిచ్చి బీసీలు ఆత్మగౌరవంతో బతికేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
లక్ష మందితో సభ: హరీశ్
కోకాపేటలో నిర్మిస్తున్న యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను మార్చి10న ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రులు, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బండ ప్రకాశ్ తదితరులతో కలిసి పరిశీలించారు. ఆయా భవనాలకు ప్రహరీ గోడ, గేట్లు, ఆర్చి నిర్మాణం తదితర పనులకు రూ.2.6 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెప్పగా.. వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ప్రారంభోత్సవం నాటికి భవనాల పనులనూ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోకాపేట ఆత్మగౌరవ సముదాయాల్లో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణం, వాటర్ లైన్ వంటి అభివృద్ధి పనులపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల ప్రారంభోత్సవం రోజు లక్ష మందితో సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.