- మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి
- రూ173 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
మక్తల్/ ఊట్కూర్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం, పల్లెల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంక్షేమం తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలోని 25 గ్రామాల్లో రూ.178.84 కోట్లతో బీటీ రోడ్లు, పలు అభివృధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి తో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి తన రాజకీయ ప్రస్థానం సర్పంచ్‌గా ప్రారంభించి 25 ఏండ్ల పూర్తయిన సందర్భంగా మంత్రి సీతక్క శ్రీహరి లలిత దంపతులను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మక్తల్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన వాకిటి శ్రీహరి 25 ఏండ్ల రాజకీయ ప్రస్థానం క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర ప్రజాసేవకు నిదర్శనమన్నారు. రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా శ్రీహరి గ్రామస్థాయి నుంచి ప్రజాసేవలో అడుగులు వేయడం విశేషమన్నారు. మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు అభివృద్ధి ప్రగతి నివేదికను రూపొందించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సాధనపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని ఆమె పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
అభివృద్ధి కోసం రూ.1600 కోట్లు..
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం 2001 ఆగస్టు 20న మక్తల్ సర్పంచ్‌గా ప్రారంభమైందని, 25 ఏండ్ల రాజకీయ ప్రయాణంలో ప్రజలు, కార్యకర్తలు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మక్తల్ నియోజకవర్గంలో సుమారు రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. నియోజకవర్గంలో 33,708 మంది రైతులకు రూ.363 కోట్ల రుణమాఫీ, 92,949 మంది రైతులకు రూ.153 కోట్ల రైతు భరోసా అందినట్లు వివరించారు. సుమారు 5,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 3,500కు పైగా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మక్తల్–-నారాయణపేట రహదారి అభివృద్ధికి రూ.237 కోట్ల నిధులు మంజూరు చేసి ఫోర్‌లైన్ రహదారిగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కొత్త క్రీడా మైదానానికి రూ.25 కోట్లు, వివిధ గ్రామాల్లో వంతెనలు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు తదితర పనులు చేపడుతున్నట్లు వివరించారు.
నారాయణపేట-–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు సాగునీటి వసతి మెరుగుపడుతుందని తెలిపారు. ఆత్మకూర్ ప్రాంతంలో రూ123 కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.26 కోట్లు, పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు, క్రీడా మైదానాలకు రూ.4.5 కోట్లు తదితర నిధులు మంజూరయ్యాయని వివరించారు. అంతకు ముందు మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన వంతెనను రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్, డీఆర్‌డీవో వెంకట్ రాములు, డీఆర్వో రాజేశ్వరి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
