
- హాట్‌హాట్‌గా సిద్దిపేట జిల్లా సమీక్షా సమావేశం
- హరీశ్ ప్రశ్నలకు వివేక్ కౌంటర్లు
- 5 గంటలకు పైగా మీటింగ్
సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉండి.. ఏం చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును మంత్రి వివేక్ వెంకటస్వామి నిలదీశారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. దీనికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. దాదాపు 5 గంటలకు పైగా హాట్‌హాట్‌గా సాగిన ఈ మీటింగ్.. ఒకానొక దశలో హరీశ్ వర్సెస్ వివేక్ అన్నట్టుగా మారింది. హరీశ్‌రావు ప్రశ్నలకు మంత్రి వివేక్ చిరునవ్వుతోనే కౌంటర్ ఇస్తూ వెళ్లారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై హరీశ్ ప్రశ్నించగా.. ‘‘మీరు అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ పెట్టడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పదేండ్లు అధికారంలో ఉండి కూడా సమస్యలు పరిష్కరించకుండా.. ఇప్పుడు వాటి గురించి ప్రశ్నించడం ఏంటి? ఎన్ని సమస్యలు ఉన్నా ఈరోజే చర్చిద్దాం.. నేను సిద్ధం’’ అని వివేక్ స్పష్టం చేశారు. వివిధ శాఖల పురోగతిపై మంత్రి సమీక్షిస్తుండగా ఎమ్మెల్యే హరీశ్‌రావు కల్పించుకుని ఆయా శాఖల్లో ఫండ్స్పెండింగ్పై వివరాలు అడిగారు. దీంతో ‘మీరు పదేండ్లు పనులను పెండింగ్ పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’ అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..
జిల్లాలో యూరియా నిల్వలపై వ్యవసాయ అధికారులను మంత్రి వివేక్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్పేర్కొనగా.. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని, సన్నవడ్ల బోనస్ అందలేదని హరీశ్ ప్రస్తావించగా.. రూ.2 లక్షల పైన ఉన్నోళ్లకు రుణమాఫీ చేయలేదని, కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిందని వివేక్ వివరించారు. టీహబ్ సమస్యలు, వెయ్యి బెడ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్టల్ నిర్మాణ పనులతో పాటు పలు అంశాలను హరీశ్ ప్రస్తావించగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 40 కోట్లు విడుదల చేయించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరగా.. బీఆర్ఎస్ హయాం నుంచే ఈ నిధులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని మంత్రి వివేక్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో నూకలు ఉంటున్నాయని హరీశ్ చెప్పగా.. మంచి బియ్యం సప్లై అయ్యేలా చూడాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. పరిశ్రమల శాఖలో పెండింగ్ నిధుల గురించి హరీశ్ ప్రస్తావించగా.. 2021 నుంచి ఎస్సీలకు సంబంధించి 73.5 కోట్లు, ఎస్టీలకు 56.7 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ.. గత ప్రభుత్వం పదేండ్ల పాటు ఏ శాఖలోనూ బిల్లులు చెల్లించకుండా అందరినీ ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పలు సమస్యలను ప్రస్తావించగా.. ‘‘గతంలో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు వాటిని ఎందుకు పరిష్కరించుకోలేదు. అప్పుడు పెండింగ్‌లో ఉన్న పనులను చేయాలని అడగడం ఏమిటి?” అని మంత్రి వివేక్ నిలదీశారు.
ప్రొటోకాల్‌పై గొడవ..
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫొటో లేకపోవడంపై బీఆర్ఎస్లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గతంలో కేసీఆర్ ఫొటో పెట్టినా ఆయన మీటింగ్కుఎందుకు రాలేదో చెప్పాలంటూ కాంగ్రెస్ లీడర్లు ప్రశ్నించారు. హరీశ్, కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
ఇందిరమ్మ ఇండ్లపై రాజకీయం చేయొద్దు
ఇందిరమ్మ ఇండ్లపై రాజకీయం చేయొద్దని మంత్రి వివేక్ అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్నాయకులు పదేండ్లు ఏం చేశారని ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సన్నబియ్యం అమ్ముకున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
కార్యకర్తలతో వివేక్ భేటీ..
సిద్దిపేట పట్టణంలోని పార్టీ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. ప్రభుత్వ స్కీమ్‌లపై ప్రచారం చేయాలని, స్థానిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని వాళ్లకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ పాల్గొన్నారు.