కోవిడ్ కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం.. ఏప్రిల్ 31 వరకు అమలు

కోవిడ్ కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం.. ఏప్రిల్ 31 వరకు అమలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఖచ్చితంగా టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్, కోవిడ్ నియంత్రణ చర్యలు, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నియమాలు ఏప్రిల్ 1, 2021 నుంచి ఏప్రిల్ 30, 2021 వరకు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. కోవిడ్ కేసులను అదుపులోకి తీసుకురావడమే ఈ మార్గదర్శకాల యొక్క ముఖ్య ఉద్దేశం. పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని ప్రాంతాలలో టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించేలా చూస్తూ.. టీకాల డ్రైవ్‌ను పెంచాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. దేశంలో అన్ని రంగాల యొక్క కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావడంతో మహమ్మారిని పూర్తిగా అధిగమించడానికి, నిర్దేశించిన నియంత్రణ వ్యూహాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

టెస్ట్- ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్

  • ఆర్టీపీసీఆర్ పరీక్షల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆ పరీక్షల వేగాన్ని పెంచాలి. నిర్దేశించిన స్థాయి 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ పరీక్షలు చేయాలి. 
  • ఇంటెన్సివ్ టెస్టింగ్ ఫలితంగా కనుగొనబడిన కొత్త పాజిటివ్ కేసులకు సకాలంలో చికిత్స అందించాలి. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచాలి.
  • ప్రోటోకాల్ ప్రకారం.. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని ముందుగానే గుర్తించి.. వారిని కూడా నిర్బంధంలో ఉంచాలి.
  • పాజిటివ్ కేసులు మరియు వారి కాంటాక్ట్‌ల ట్రాకింగ్ ఆధారంగా కంటైన్‌మెంట్ జోన్లను జిల్లా అధికారులు గుర్తించాలి.
  • కంటైన్‌మెంట్ జోన్‌ల జాబితాను వెబ్‌సైట్లలో సంబంధిత జిల్లా కలెక్టర్లు తెలియజేస్తారు. ఈ జాబితా రోజూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం చేయబడుతుంది.
  • సరిహద్దు కంటైన్‌మెంట్ జోన్లలో కోవిడ్ నిబంధనలు చాలా కఠినంగా అనుసరించబడతాయి. వీటిలో నో ఎంట్రీ, ఇంటెన్సివ్ హౌస్-టు-హౌస్ నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, సర్వైలెన్స్ మొదలైనవి ఉన్నాయి.
  • కంటైన్‌మెంట్ చర్యలను స్థానిక జిల్లా, పోలీసు మరియు మునిసిపల్ అధికారులు బాధ్యతగా పాటించాలి. ఈ విషయంలో సంబంధిత అధికారులు జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలి.

తాజా నిబంధనలు

  • వర్క్ ప్లేస్‌లతో పాటు బహిరంగ ప్రదేశాలు ముఖ్యంగా రద్దీ ప్రదేశాలలో ఈ నిబంధనలను పాటించేలా ఆయా ప్రభుత్వాలు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటాయి.
  • ఫేస్ మాస్క్‌లు, చేతలు పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించడం కఠినంగా అమలు చేయడానికి రాష్ట్రాలు మరియు యూటీలు తగిన జరిమానాలు విధించడంతో సహా పలు చర్యలను తీసుకోవచ్చు.
  • ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా అమలుచేయబడతాయి. తద్వారా కోవిడ్‌ను నియంత్రణలోకి తీసుకురావచ్చు.
  • కోవిడ్ వ్యాప్తి ఆధారంగా జిల్లా, మండలం, పట్టణం, మరియు వార్డు స్థాయిలో నిబంధనలను విధించవచ్చు.
  • ఇంటర్-స్టేట్ మరియు ఇంట్రా-స్టేట్ విషయంలో ఎటువంటి పరిమితులు విధించబడలేదు.
  • పొరుగు దేశాలకు వెళ్లడానికి లేదా రావడానికి ఎటువంటి ఆంక్షలు విధించబడలేదు. దీనికోసం ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు.
  • కంటైన్‌మెంట్ జోన్ల బయట అన్ని కార్యకలాపాలకు అనుమతులున్నాయి. రైళు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్లు, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, యోగా కేంద్రాలు, వ్యాయామశాలలు, ప్రదర్శనలు, సమావేశాలు మరియు సమ్మేళనాలు మొదలైనవి నిర్వహించుకోవచ్చు.
  • ఎప్పటికప్పుడు విడుదలచేయబడిన నూతన మార్గదర్శకాలు సంబంధిత అధికారులచేత ఖచ్చితంగా అమలు చేయబడతాయి. ఆ నిబంధనల అమలుకు వారే బాధ్యత వహిస్తారు.
  • కోవిడ్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను ప్రారంభించింది.
  • టీకా డ్రైవ్ కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలితప్రాంతాలలో నెమ్మదిగా సాగుతోంది. అందువల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యూటీలు టీకాల వేగాన్ని త్వరగా పెంచాలి.