చిన్నారుల ఆరోగ్యంపై నిఘా కోసం ‘పోషణ్‌ ట్రాకర్‌’

చిన్నారుల ఆరోగ్యంపై నిఘా కోసం ‘పోషణ్‌ ట్రాకర్‌’
  • పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడంపై మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఫోకస్

దేశంలో బాలలు, మహిళలు, బలహీన వర్గాల ప్రజలకు పోషకాహార లోపం నిరంతర సవాలు. పోషకాహార లోపానికి సంబంధించి ప్రపంచంలో ఇండియా ఒకప్పుడు అధ్వాన స్థితిలో ఉండేది. బాలల ఆరోగ్య సూచీల పరంగా చూస్తే అధ్వానంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ కూడా ఒకటని1992-–1993లో నిర్వహించిన తొలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) నివేదిక పేర్కొంది. పోషకాహార లోపం సమస్యను పరిష్కరించేందుకు మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ నడుం బిగించింది.

అవసరమైన చర్యలు చేపట్టడంతోపాటు సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) వంటి కార్యక్రమాలు మొదలు పెట్టింది. అత్యధికంగా పోషకాహార లోపం గల ఆరేండ్ల లోపు బాలలు, గర్భిణులు, బాలింతలు, కౌమార బాలికలే లక్ష్యంగా అనుబంధ ఆరోగ్య ఆహారం/బలవర్ధక రేషన్‌ సరుకుల పంపిణీ వంటి చర్యలు తీసుకుంది. పోషకాహార లోపాన్ని సమూలంగా నివారించే లక్ష్యంతో ప్రధానమంత్రి నిర్దేశం మేరకు 2018లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం ప్రారంభించింది. పోషకాహార లోపం, ఎదుగుదల లోపం, రక్తహీనత, తక్కువ బరువుతో శిశు జననం తదితర సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

సాంకేతిక పరిజ్ఞానానికి గల శక్తి గురించి ప్రధానమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం పదేపదే నొక్కి చెబుతున్నది. ఈ స్ఫూర్తికి అనుగుణంగా ఆశించిన ఫలితాల సాధనలో సాంకేతికతను జోడించేందుకు 2021లో ‘పౌష్టికత అనుసరణ(పోషణ్ ట్రాకర్)’ ప్రారంభమైంది. ‘ఐసీడీఎస్‌’ కింద దేశంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి పోషకాహార లోపం, నమోదైన వ్యక్తులకు సంబంధించిన గణాంకాలు/సమాచార రికార్డుల డిజిటలీకరణ లక్ష్యంగా పోషణ్​ ట్రాకర్​అమలులోకి వచ్చింది. దీని వల్ల నిరంతర -ప్రత్యక్ష పర్యవేక్షణతోపాటు, తదనుగుణంగా ఆశించన లక్ష్య సాధనకు విధి విధానాల రూపకల్పనకు మార్గం సుగమమైంది.

ఆరోగ్యకరమైన దేశం కోసం

ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడానికి, సేవల లబ్ధి, గణాంకాలు, రుజువులు, సమాచార సేకరణ మార్గాలు ఎంతో కీలకం. ‘పోషణ్‌ ట్రాకర్’ కేవలం గణాంక అనుసరణ యంత్రాంగం మాత్రమే కాదు, ఇది పోషకాహార కార్యక్రమం, దాని సేవల సమర్థత, ప్రభావాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ ఉపకరణంగా పనిచేస్తున్నది. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఆర్‌సీహెచ్‌’ పోర్టల్ వంటి ఇతర విధానాత్మక సాధనాలతో సమన్వయం ద్వారా లబ్ధిదారుల ఆరోగ్యం, పోషకాహార సూచీల సంపూర్ణ స్వరూపాన్ని ఈ ట్రాకర్‌ నిర్ధారిస్తున్నది. ఈ పోషణ్‌ ట్రాకర్‌ ప్రారంభించి ఇప్పటికి ఏడాదిన్నర మాత్రమే గడిచింది.

ఈ వ్యవస్థ స్థిరీకృతమైతే దేశంలోని13 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వచ్చే రోజువారీ అపార సమాచారం పరిశీలన, పౌష్టికత ఫలితాల అంచనాల్లో ఈ ట్రాకర్‌సామర్థ్యం అపరిమిత స్థాయిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోని మరే దేశంలోనూ బహుశా ఇంత పెద్ద ఎత్తున చొరవతో కార్యక్రమం నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటిదాకా పోషకాహార లోపం గురించి ‘ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌’ నివేదికల ద్వారా మాత్రమే సమాచారం అందుబాటులో ఉండేది.

అయితే ఈ సర్వేలు శాంపిల్​గృహాల సంఖ్య ప్రాతిపదికన మాత్రమే అధ్యయనం చేస్తాయి. ఈ నేపథ్యంలో ట్రాకర్‌ ద్వారా మెరుగైన, మరింత ప్రభావవంతమైన చర్యలకు సౌలభ్యం కల్పిస్తూ అంగన్‌వాడీ సేవలకు నమోదైన ప్రతి లబ్ధిదారు ఆరోగ్య-పోషకాహార సూచీల సేకరణ, పర్యవేక్షణ అపూర్వమనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాలను మారుస్తున్నదని ప్రధానమంత్రి ఎప్పుడూ అంటుంటారు.

పేదరిక నిర్మూలన నుంచి వివిధ ప్రక్రియల సరళీకరణ దాకా, అవినీతి అంతం నుంచి మెరుగైన సేవా ప్రదానం వరకు సాంకేతికత నేడు సర్వాంతర్యామి. మానవ ప్రగతికి ఇది ఏకైక కీలక సాధనంగా రూపొందింది. ఇండియా తనకున్న జనసంఖ్యను, మానవ మూలధనాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దేశంలోని పిల్లలు, యువతరం ఆరోగ్యంగా ఉండటం అవశ్యం. పోషకాహార లోపం అనేది దాంతో బాధపడే బాలలకు మాత్రమేగాక దేశంలోని సామాజిక-ఆర్థిక సమూహాల పరంగా కుటుంబ, సామాజిక భారానికి దారితీస్తుందన్న వాస్తవాన్ని మనం గ్రహించాం.

బలమైన, ఆరోగ్యకరమైన జనాభా వృద్ధి విషయంలో సరైన పోషకాహారం అందించాల్సిన అవసరం ఉన్నది. తద్వారా పోషకాహార లోపాన్ని తిప్పికొట్టొచ్చు. దాని దుష్ప్రభావాలనూ గణనీయంగా తగ్గించడం వీలవుతుంది. ఈ మేరకు సంపూర్ణ పౌష్టికారోగ్యంపై సమగ్ర అవగాహన పెంచడం ద్వారా ఆరోగ్యకర భవిష్యత్తుపై భారతదేశంలోని మహిళలు, బాలలకు మేం భరోసా ఇస్తున్నాం.

అక్రమాలకు తావులేకుండా..

పోషణ్ అభియాన్ కింద తొలిసారి అంగన్‌వాడీ కేంద్రాలు/కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు అందాయి. పిల్లల్లో ఎదుగుదల లోపం, అవయవ బలహీనత, తక్కువ బరువు తదితర అంశాలు సహా పౌష్టికతను, చివరి అంచె దాకా వారి వికాసాన్ని పసిగట్టడం కోసం ‘పోషణ్‌ ట్రాకర్‌’ బాగా ఉపయోగపడుతున్నది. దేశంలోని13.9 లక్షలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాలు, వాటి పరిధిలో గల 9.8 కోట్ల మంది లబ్ధిదారుల రోజువారీ గణాంకాల సేకరణకు ఈ ట్రాకర్​ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నది.

దీనిద్వారా అన్ని  అంగన్‌వాడీలు, కార్యకర్తలు, లబ్ధిదారులపై నిరంతర-ప్రత్యక్ష పర్యవేక్షణ సాధ్యమైంది. . పర్యవేక్షకులు, కార్యక్రమ అధికారులు ఎప్పటికప్పుడు ప్రగతిని పసిగట్టేందుకు వారికి అందుబాటులోగల వెబ్ ఆధారిత డ్యాష్‌బోర్డ్‌ కూడా తోడ్పడుతుంది. ఈ నిరంతర- ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలు, కార్యకర్తలు, లబ్ధిదారుల కార్యకలాపాలను నిశితంగా మానిటర్​చేయవచ్చు. తద్వారా ఈ కార్యక్రమ ప్రగతిపై సమగ్ర సమీక్షకు వీలు కలుగుతుంది.

ఇది హిందీ, ఆంగ్ల భాషల్లోనేగాక ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. చివరి అంచెదాకా కార్యక్రమాల అమలను పసిగట్టడానికి మంత్రిత్వ శాఖ స్థిరంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే ‘పోషణ్‌ ట్రాకర్‌’ ద్వారా నమోదైన లబ్ధిదారులు ఆధార్‌సంఖ్యను అనుసంధానించింది.బాలల ఆధార్‌అందుబాటులో లేనిపక్షంలో వారి తల్లి ఆధార్‌నెంబర్​తో అనుసంధానించే వెసులుబాటునిచ్చింది. ఆధార్ అనుసంధానంతో కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక యంత్రాంగం ఉందన్న భరోసా ఉంది. అక్రమాలు, నకిలీ నమోదులు లేవని నిర్ధారించుకోవడంలోనూ సాంకేతికత బాగా తోడ్పాటునిస్తున్నది. ఈ మేరకు ఇప్పటిదాకా దాదాపు 82 శాతం లబ్ధిదారులు వారి ఆధార్​ నెంబర్​ను అనుసంధానించారు.

మరోవైపు ‘పోషణ్‌ ట్రాకర్’ బదిలీ మాడ్యూల్‌ ప్రారంభం ద్వారా అంగన్‌వాడీ సేవల వాస్తవ సార్వజనీతను సులభం చేసింది. ఈ మాడ్యూల్ వల్ల లబ్ధిదారుల రికార్డులను ఒక అంగన్‌వాడీ కేంద్రం నుంచి మరొకదానికి లేదా రాష్ట్రం/రాష్ట్రాలన్నిటా నిరంతరాయ బదిలీకి వీలుంటుంది. తద్వారా లబ్ధిదారులు దేశంలో ఎక్కడున్నా సేవలు పొందే అవకాశం లభిస్తుంది.  - శ్రీఇందీవర్‌ పాండే, కార్యదర్శి, కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ