ఎండుతున్న పంటలు..అంగి లేకుండా మాజీ ఎమ్మెల్యే నిరసన

ఎండుతున్న పంటలు..అంగి లేకుండా మాజీ ఎమ్మెల్యే నిరసన

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద చివరి భూములు.. సాగునీరు లేక ఎండిపోతున్నాయని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ చెప్పారు. అటు ప్రాజెక్టు నీరు, ఇటు త్రీఫేస్ కరెంటు సరఫరా లేక పొట్ట దశకు చేరి ఎండిపోతున్న వరి పంటలను రక్షించుకునేందుకు రైతులు... గోస తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామంలో సాగునీరందక దెబ్బతింటున్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళన నిర్వహించారు. వెంటనే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.  రుణమాఫీ చేయకపోవడంతో  రైతులకు బ్యాంకర్ల నుంచి నోటీసులు వస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ, నిరుద్యోగ, కార్మిక సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రధాన సమస్యలన్నింటినీ గాలికొదిలేసి.. డబ్బు, అధికార బలంతో గెలుస్తామనుకుంటున్న అధికార పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.