న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాషాయం కప్పుకున్న కసాయి అని ఆ పార్టీ నేత మీసాల శ్రీనివాస్ రావు విమర్శించారు. ఆయన ఎంపీ పదవికి అనర్హుడని, ప్రధాని మోదీతో కలిసి పార్లమెంట్ లో కూర్చునే స్థాయి ఆయనకు లేదన్నారు. అహంకారి, దుర్మార్గుడైన అర్వింద్ కు టికెట్ ఇవ్వొద్దని హైకమాండ్ ను కోరారు. నిజామాబాద్ సీటును డేరా బాబా, స్వామి నిత్యానందకు ఇచ్చినా అడ్డు చెప్పేవాళ్లం కాదన్నారు. ఇంకా టైం ఉన్నందున అర్వింద్ కు కేటాయించిన సీటుపై పునరాలోచన చేయాలన్నారు.
అలా కాకుంటే ఇక తమ కర్మ అని సరిపెట్టుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీసాల శ్రీనివాస్ రావు, తన సతీమణి, బీజేపీ కార్పొరేటర్ సవితతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ లోని లక్షల మంది ప్రజలు అర్వింద్ బాధితులన్నారు. ఆయనకు టికెట్ ఇవ్వడం పార్టీ చేస్తున్న తప్పుగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ విషయంలో మోదీ, నడ్డా, అమిత్ షా, సంతోశ్ సహా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అర్వింద్ పై క్షేత్ర స్థాయిలో వ్యAతిరేకత ఉందన్నారు. పార్టీ గుర్తుకు ప్రజలు ఓటు వేస్తామని, కానీ మరో ఐదేండ్లు అర్వింద్ ను భరించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన తండ్రి డీఎస్ చక్రం తిప్పడంతో గెలిచానని చెప్పుకున్న అర్వింద్.. దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
