ఐదు రోజులుగా 30 ఊర్లకు భగీరథ నీళ్లు బంద్

ఐదు రోజులుగా 30 ఊర్లకు  భగీరథ నీళ్లు బంద్

కౌడిపల్లి, వెలుగు : మెదక్  జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలకు ఐదు రోజులుగా మిసన్​ భగీరథ నీటి సరఫరా బంద్ అయింది. గ్రామ పంచాయతీ ట్యాంకర్​ ఉన్నా సరిపడా నీరు సరఫరా చేయడంలేదు. దీంతో స్థానికులు గత్యంతరం లేక పాత మినీ వాటర్​ ట్యాంకులు, వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకొంటున్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లి లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు పాషా ఉచితంగా వాటర్ ట్యాంకర్  ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. 

మరికొందరు ప్రైవేట్​ ట్యాంకర్ కు డబ్బులు ఇచ్చి నీరు తెప్పించుకుంటున్నారు. ఇంటికి ఐదు వందలు ఇచ్చి డ్రమ్ముల్లో నింపుకుంటున్నారు. ఐదు రోజులుగా నల్లా నీళ్లు రాకున్నా పట్టించుకునే వారు లేరని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నర్సాపూర్  మండలం హనుమంతపూర్ శివారులో మిషన్ భగీరథ పైప్​ లైన్​ జాయింట్  తెగిపోయిందని, ది. దీంతో భగీరథ నీటి సరఫరా ఆగిపోయిందని భగీరథ డీఈ ప్రవీణ్​ కుమార్  తెలిపారు. ఆదివారం నుంచి భగీరథ నీరు అన్ని గ్రామాలకూ సరఫరా అవుతుందని ఆయన చెప్పారు.