జైపూర్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన​ పాలన

జైపూర్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన​ పాలన
  • ఉన్నతాధికారులు ఔట్​సోర్సింగ్​ వాళ్లే  
  • పట్టించుకోని సింగరేణి యాజమాన్యం

మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ (ఎస్టీపీపీ) నిర్వహణ గాడి తప్పిందనే ఆరోపణలు వస్తున్నాయి. పాలన వ్యవస్థ పూర్తిగా ఇద్దరు రిటైర్డ్​ ఆఫీసర్ల చేతిలో పెట్టడంతో అంతా అస్తవ్యస్తంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2016 సంవత్సరంలో 1200 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యంలో ఎస్టీపీపీని ప్రారంభించారు. సింగరేణి ఆధ్వర్యంలో మొదటిసారిగా భారీ పవర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. అప్పటివరకు బొగ్గు వెలికితీతలో రికార్డులు సాధించిన సింగరేణి అధికారులకు విద్యుత్​ ఉత్పత్తిలో ఎలాంటి అనుభవం లేదు. పవర్​ ప్లాంట్​ నిర్వహణ బొత్తిగా కొత్త కావడంతో రామగుండం ఎన్టీపీసీలో రిటైర్డ్​ అయిన ఇద్దరు అధికారులను తీసుకున్నారు. ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో ఉన్నత స్థానాల్లో నియమించారు.  

ఆ ఇద్దరిదే పెత్తనం...

ఎస్టీపీపీని గాడిలో పెట్టేంత వరకే ఔట్​సోర్సింగ్​ అధికారుల బాధ్యత కాగా ప్లాంట్​లో వాళ్లిద్దరే పెత్తనం చెలాయిస్తున్నారు. నెలనెలా రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. సింగరేణి ఉన్నతాధికారుల అండదండలు దండిగా ఉండడంతో వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైందని విమర్శలు వస్తున్నాయి. ఆ ఇద్దరు అధికారులు గత ఆరేండ్లుగా కీలక స్థానాల్లో తిష్టవేసి ప్లాంట్​ వ్యవహారాలపై పూర్తిగా పట్టు సాధించారు. సింగరేణికి చెందిన సీనియర్​ ఆఫీసర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉన్నప్పటికీ సంస్థ ఉన్నతాధికారులు వాళ్లకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించడానికి ఎందుకోగాని ఇష్టపడం లేదు. దీంతో ఔట్​సోర్సింగ్​ ఆఫీసర్లు సింగరేణికి లాభం చేయడం కాకుండా కాంట్రాక్ట్​ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 70 ఏండ్లకు దగ్గర ఉన్న అధికారులు నెలలో సగం రోజులు కూడా ప్లాంట్​లో ఉండరని చెప్తున్నారు.  

పీఎల్ఎఫ్ సాధిస్తే చాలా? 

ఎస్టీపీపీ నిర్వహణను ప్రైవేట్​ సంస్థలకు, పాలనా వ్యవహారాలను ఔట్​సోర్సింగ్​ అధికారులకు అప్పగించిన సింగరేణి మేనేజ్​మెంట్​ కేవలం వంద శాతం పీఎల్​ఎఫ్​ సాధిస్తే చాలన్నట్టు వ్యవహరిస్తోంది. భూనిర్వాసితులకు ఉద్యోగాలు, కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్​ మంచిచెడ్డలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్లాంట్​లో 250 మందికిపైగా పర్మినెంట్​ ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు ఉండాల్సినప్పటికీ టెంపరరీ ఎంప్లాయీస్​తోనే నడిపిస్తుండడం గమనార్హం. ప్లాంట్​లో ఔట్​సోర్సింగ్​ ఆఫీసర్ల నియంతృత్వం రోజురోజుకు పెరుగుతోందన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఉత్తరాదికి చెందిన వాళ్లు కావడంతో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఉద్యోగులు, కార్మికులపై వల్లమాలిన ప్రేమ చూపుతున్నారని లోకల్​ కార్మికులు ఆరోపిస్తున్నారు. జీతభత్యాల్లోనూ స్థానికులకు, ఉత్తరాది వాళ్లకు మధ్య భారీగా వ్యత్యాసం ఉంటోందని పేర్కొంటున్నారు.

సీఎంవోకు ఫిర్యాదులు వెళ్లినా...

ఎస్టీపీపీలో ఆరేండ్లుగా తిష్టవేసి కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ ఇద్దరు అధికారులపై గతంలో సీఎంవోకు ఫిర్యాదులు వెళ్లాయి. అధికారుల వ్యవహార శైలితో విసుగెత్తిన కొంతమంది నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. రోజురోజుకు అధికారుల నియంతృత్వ ధోరణి పెరుగుతుండడంతో వాళ్లను కీలక బాధ్యతల నుంచి తప్పించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.