
- ఆదిలాబాద్ జిల్లా పల్సి ‘బి’ తండా స్కూల్‌లో 52 మంది స్టూడెంట్లకు.. ఒకే టీచర్, ఒకే రూమ్
- సిరిసిల్ల జిల్లా గర్జనపల్లి స్కూల్‌లో 22 మంది స్టూడెంట్లకు ఆరుగురు టీచర్లు
- స్టూడెంట్లు లేక వెలవెలబోతున్న జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్ రోడ్డు స్కూల్
ఆదిలాబాద్ టౌన్ (తలమడుగు)/వీర్నపల్లి/మల్యాల, వెలుగు : రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. స్టూడెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట సరిపోను టీచర్లు, క్లాస్‌రూమ్స్ లేక ఇబ్బందులు తలెత్తుతుండగా... స్టూడెంట్లు లేని చోట మాత్రం అవసరానికి మించి టీచర్లు ఉంటున్నారు. మరి కొన్ని స్కూళ్లకు అసలు స్టూడెంట్లే రాకపోవడంతో టీచర్లు ఖాళీగా కూర్చుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి‘బి’ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 52 మంది స్టూడెంట్లు ఉన్నారు. వీరందరికీ ఒకే టీచర్, ఒకే క్లాస్ రూమ్ ఉంది. దీంతో అన్ని తరగతుల వారిని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు.
22 మంది స్టూడెంట్లకు ఆరుగురు టీచర్లు
వీర్నపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 22 మంది స్టూడెంట్లు ఉండగా.. ఇక్కడ ఆరుగురు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్‌లో ఆరో క్లాస్ నుంచి తొమ్మిదో తరగతి వరకు 21 మంది స్టూడెంట్స్ ఉండగా.. టెన్త్‌లో మాత్రం దావ రూపక్ అనే స్టూడెంట్ ఒక్కడే ఉన్నాడు. దీంతో ఆ ఒక్కడికే టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు.
స్టూడెంట్లు లేక ఖాళీగా కూర్చుంటున్న టీచర్లు
మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మల్యాల క్రాస్ రోడ్డు గత స్కూల్‌లో ఈ సంవత్సరం ఐదుగురు స్టూడెంట్లు అడ్మిషన్ తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌గా స్కూల్‌కు వస్తున్నారు. గురువారం ఆ ఇద్దరు కూడా రాకపోవడంతో హెచ్‌ఎం కృష్ణాంజలి ఖాళీగా కూర్చున్నారు. గొర్రెగుండం స్కూల్‌లో ఈ ఏడాది నాలుగు అడ్మిషన్లు రాగా... ఇందులో ముగ్గురు మాత్రమే స్కూల్‌కు హాజరయ్యారు. ఈ విషయమై ఎంఈవో జయసింహారావు మాట్లాడుతూ... మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే టీచర్లను డిప్యూటేషన్‌పై ఇతర స్కూళ్లకు పంపిస్తామని
చెప్పారు.