14న రామప్పకు మిస్​వరల్డ్​ కంటెస్టెంట్లు

14న రామప్పకు మిస్​వరల్డ్​ కంటెస్టెంట్లు

ములుగు, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరీ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కంటెస్టంట్లు సందర్శించనున్నట్లు కలెక్టర్​ దివాకర వెల్లడించారు. తెలంగాణ భాష, సంస్కృతి, రుచులు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఆఫీసర్లు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు కలెక్టరేట్ లో ఎస్పీ శబరీశ్​తో కలిసి ప్రెస్​మీట్​లో మాట్లాడారు. 

14న రామప్ప సందర్శనకు టూరిస్ట్​లను నిలిపివేస్తున్నామని, పాలంపేటలో ఆర్చ్​నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎవరినీ లోపలికి అనుమతించమని, కేవలం గ్రామస్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. 35 దేశాల నుంచి వచ్చే మిస్​ వరల్డ్​ పోటీల కంటెస్టెంట్లు మధ్యాహ్నం నుంచి షెడ్యూల్ ప్రకారం రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారని, వారితోపాటు వ్యక్తిగత సహాయకులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు తదితరులు సుమారు 250 మంది వచ్చే అవకాశం ఉందన్నారు. 

ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎవరికీ ఆలయంలోపలికి అనుమతి ఉండదన్నారు. మీడియాకు ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నామని, పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎవరూ ఫొటోలు, వీడియోల కోసం డ్రోన్​ కెమెరాలను ఎగురవేయొద్దని, 5 కి.మీ రేడియస్ లో డ్రోన్లకు నిషేధం ఉందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రామప్పలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, అంతర్జాతీయ ఈవెంట్ ను సక్సెస్​ చేసేందుకు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండీ రఫీక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.