
- తెలంగాణపై రూపొందించిన వీడియో, డ్రోన్ షోతో అబ్బురం
- కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన అందగత్తెలు
- తెలంగాణ పోలీసింగ్‌ను వివరించిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అందగత్తెలు ఆదివారం సాయంత్రం రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ముగ్ధులయ్యారు. కట్టు, బొట్టు చూసి తెలంగాణ ఉమన్అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సుందరాంగులు సెక్రటేరియేట్ ప్రాంగణంలో ఆనందంగా కలియ తిరిగారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి పది దేశాల అందగత్తెలు పుష్పాంజలి సమర్పించారు.
అనంతరం తల్లికి నమస్కారం చేస్తూ రాష్ట్ర అధికార గీతాన్ని ఆలపించారు. తర్వాత ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సెక్రటేరియెట్ కు వీరి రాక సందర్భంగా తెలంగాణ స్పెషల్ వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులతో ఫొటోలు దిగి, సరదాగా సంభాషించారు.
ఈ సందర్భంగా అందగత్తెలకు తెలంగాణపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక కేంద్రాలు, వాణిజ్య పురోగతిని వివరిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ఆ తర్వాత బయట లాన్లో వెయ్యి డ్రోన్లతో ఏర్పాటు చేసిన డ్రోన్ షోను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆసక్తిగా తిలకించారు. 'తెలంగాణ జరూర్ ఆనా', యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, చార్మినార్, తెలంగాణ రైజింగ్, మహాలక్ష్మి, 72వ మిస్ వరల్డ్ డ్రోన్ షోలు ఆకట్టుకున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ ల కుటుంబసభ్యులు మిస్ వరల్డ్ తో, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లతో ఫోటోలు దిగారు. కొందరు పిల్లలు అందరి నుంచి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.
పోలీసింగ్ పై ప్రజెంటేషన్
సెక్రటేరియెట్ విజిట్ కు ముందు బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించారు. వారికి పోలీస్ అశ్విక దళం, పైప్ బ్యాండ్, మోటార్ సైకిల్ రైడర్స్, స్నిపర్ డాగ్ స్క్వాడ్ లతో పోలీస్ శాఖ ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో వారికి రాష్ట్ర పోలీసింగ్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అమలు చేస్తున్న విధానాలను తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన విధానాలతో నేరాలు 17 శాతం తగ్గాయని, వివిధ అంశాల్లో రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయన్నారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విభాగంలో నియమించిన విషయాన్ని చెప్పారు.
లక్షలాది సీసీ టీవీ కెమెరాలతో శాంతి భద్రతల పర్యవేక్షణను వివరించారు. తెలంగాణ టూరిజం పరంగా అత్యంత సురక్షితమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు, పిల్లలపై వేధింపుల నివారణ, డ్రగ్స్ కట్టడికి చేపట్టిన చర్యలు, నేరాల నియంత్రణ, నేర నివారణలో ఆధునిక టెక్నాలజీ, తదితర అంశాల్లో పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన చర్యలను అభినందించారు. డ్రగ్స్ నివారణ కోసం తెలంగాణ పోలీస్ చేపట్టిన చర్యలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పోస్టర్లపై సంతకాలు చేసి తమ మెసేజ్ లు రాశారు. కాగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో ఐఏఎస్‌లు హరిచందన, కృష్ణ భాస్కర్ యాంకర్లుగా వ్యవహరించారు. ఇద్దరు ఐఏఎస్అధికారులూ ప్రోగ్రామ్‌ను దగ్గరుండి నిర్వహించారు.
ఫ్యామిలీతో మళ్లీ వస్తా
తెలంగాణ నాకు ఎంతో నచ్చింది. ఇక్కడ చూసేందుకు చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ పోటీల తరువాత హాంకాంగ్, ఇతర దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా మైండ్ మారింది. నా ఫ్యామిలీతో కలిసి తెలంగాణకు వస్తాను. ఇక్కడ చూడాల్సిన చారిత్రక, పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. - జాస్మిన్ స్ట్రింగర్, మిస్ ఆస్ట్రేలియా
వంటలు స్పైసీ.. వెదర్ సో హాట్
తెలంగాణ వంటకాలు అద్భుతం. స్పైసీగా ఉన్నప్పటికీ టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కావడంతో ఇక్కడ చాలా హాట్ గా ఉంది. హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ సూపర్. ఇక్కడి పిండి వంటకాల గురించి కూడా తెలుసుకుంటున్నా. - సమంతపూలే, మిస్ న్యూజిలాండ్
వావ్.. తెలంగాణ తల్లి సూపర్
తెలంగాణ తల్లి విగ్రహం అద్భుతంగా ఉంది. తెలంగాణ గ్రామీణ మహిళ.. తెలంగాణ అమ్మ రూపం అని చెప్పారు. ఆ చీరకట్టు, బొట్టు, కాళ్లకు పట్టీలు వావ్.. సూపర్. తెలంగాణ అంటే ఫైటింగ్ నేచర్ అని తెలుసుకున్నా. మేం విజిట్ చేసిన ప్లేస్‌లు, చరిత్ర చూస్తే ఆ విషయం అర్థమైంది. ప్రపంచ పోటీలు తెలంగాణలో నిర్వహించడం, ఇక్కడకు మేమంతా రావడం లక్కీగా భావిస్తున్నాం. - మాజా క్లాజ్దా, మిస్ పోలాండ్
పాతబస్తీ మృతులకు సంతాపం..
పాతబస్తీ గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ మృతులకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, మంత్రులు, అధికారులు సంతాపం ప్రకటించారు. సెక్రటేరియెట్ సందర్శన సందర్భంగా వారు కొన్ని నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళులు అర్పించారు.