
- పది విభాగాల్లో పోటీలు.. పాల్గొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
- హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి
- కొత్త క్రీడా పాలసీ కోసం ప్రత్యేక ప్రణాళికలు: జూపల్లి
- రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన కంటెస్టెంట్లు
హైదరాబాద్, వెలుగు: క్రీడల్లో అందాల భామలు మెరిశారు. వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఫినాలే కార్యక్రమం నిర్వహించారు. స్పోర్ట్స్‌డే ఈవెంట్లో భాగంగా మొత్తం పదివిభాగాల్లో జరిగిన పోటీల్లో కంటెస్టెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మొదట బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్ పాల్గొన్నారు.
మొదట కంటెస్టెంట్స్‌తో మంత్రి జూపల్లి కృష్ణారావు బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అందాల భామలు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. అమెరికన్, కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానియా కంటెస్టెంట్స్ ను బృందాలుగా విభజించగా.. వారు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు, క్రీడాకారులు తాంగ్ -త మార్షల్ ఆర్ట్స్ , రోలర్ స్కేటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
బ్యాడ్మింటన్, షాట్ పుట్, ఫుట్‌బాల్ పెనాల్టీ షూటౌట్, చెస్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, షటిల్, ఫిట్‌నెస్ రన్, స్ప్రింట్ రిలే వంటి స్పోర్ట్స్ ఈవెంట్లలో తమదైన ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మలు జుంబాడాన్స్ తో సందడి చేశారు.
నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియెట్ సందర్శన
సేఫ్టీ టూరిజంలో భాగంగా ఆదివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. రాష్ట్ర అశ్విక దళం, డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ బలగాలతో ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం సెక్రటేరియట్ ను సందర్శించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. ప్రభుత్వ పథకాల అమలుపై త్రీడీ మ్యాపింగ్, డ్రోన్ షో ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి: మంత్రి జూపల్లి
ఒకప్పుడు క్రీడల్లో మహిళలు నామమాత్రంగా పాల్గొనేవారని, ఇప్పుడు పతకాలు అందించే స్థాయికి ఎదిగారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మానసిక స్థైర్యం పెరుగుతుందని, అది మనం ఏదైనా సాధించేలా చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, కొత్త స్పోర్ట్స్పాలసీకి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేయడం, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేయడం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్.. యువతను ఫిట్‌నెస్ వైపు ప్రేరేపిస్తుందని రాజీవ్ శుక్లా అన్నారు.
స్పోర్ట్స్ డే.. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాగా, మిస్ వరల్డ్ పోటీదారులు శనివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు. రామోజీ ఫిల్మ్ సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం ఫిల్మ్ సిటీ అందాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తిలకించారు. హవామహల్, ఏంజిల్ ఫౌంటెన్, నర్తకి గార్డెన్, పామ్ గార్డెన్ లను పరిశీలించారు.