మిస్ వరల్డ్ ​పోటీలు తెలంగాణకు గర్వకారణం : జూపల్లి

మిస్ వరల్డ్ ​పోటీలు  తెలంగాణకు గర్వకారణం : జూపల్లి
  •  ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని పంచేలా ఏర్పాట్లు: జూపల్లి 
  • తెలుగులో నటించడమే ఎక్కువ ఇష్టం: సోనూ సూద్  
  •  ఆతిథ్యం చాలా బాగుంది: మిస్ ఇండియా నందిని గుప్తా

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్‌‌ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమని, ఇక్కడి సాంస్కృతిక, సంప్రదాయాలు, వారసత్వ సంపద, చారిత్రక ప్రదేశాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  మంగళవారం హైదరాబాద్‌‌లోని ట్రైడెంట్‌‌ హాటల్​లో మిస్​వరల్డ్​ పోటీలపై టూరిజం శాఖ, మిస్​వరల్డ్​పోటీల నిర్వాహుకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా యావత్ ప్రపంచ గర్వించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ పోటీల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందన్నారు. మిస్ వరల్డ్ గ్లోబల్ ఈవెంట్ అని, రాష్ట్ర సంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇదో చక్కని అవకాశమన్నారు. టూరిజం ప్రిన్సిపల్​సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు ఎంట్రీ పాస్ తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక వెబ్​సైట్( https://tourism.telangana.gov.in  )ను తీసుకొచ్చామన్నారు. ఎవరైనా లో వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని పాస్​లు పొందొచ్చని తెలిపారు.

 మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్​రెడ్డి, ప్రముఖ నటుడు సోను సూద్, మిస్ ఇండియా నందిని గుప్తా తదితరులు పాల్గొన్నారు. నందిని గుప్తా ఈ పోటీలో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. సూద్ చారిటీ ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ వేడుకల్లో మానవతావాద అవార్డును ప్రదానం చేయనున్నారు. అలాగే గ్రాండ్ ఫినాలేకు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. 

ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నయ్: సోనూ సూద్ 

బాలీవుడ్ మూవీస్ కంటే తనకు తెలుగులో నటించడమే ఎక్కువ ఇష్టమని నటుడు సోను సూద్ అన్నారు. తాను నటించిన అరుంధతి సినిమాలోని ‘వదలా బొమ్మాళీ వదలా’ అనే ఫేమస్ డైలాగ్ తో ప్రసంగం ప్రారంభించారు. 

ఈ ఒక్క డైలాగ్‌‌ తనకు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చిందని, తనని తెలుగువాడిని చేసిందన్నారు. ఈ పోటీల కోసం ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందన్నారు. మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదని, ఒక మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈవెంట్ అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ మాట్లాడుతూ 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌‌ను తెలంగాణలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

 బ్యూటీ విత్ ఏ పర్పస్” అనే తమ లక్ష్యం నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోందని ప్రశంసించారు. మిస్ ఇండియా నందిని గుప్తా మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ నాకెంతో నచ్చింది. ఈ రాష్ట్రానికి గొప్ప చరిత్ర ఉంది. ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీ హైదరాబాద్. పోచంపల్లి హ్యాండ్లూమ్స్ బాగున్నాయి. ఇక్కడ హాస్పటాలిటీ బాగుంది. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ నచ్చాయి. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ప్రజలు ప్రేమ, అనురాగాలు పంచుతున్నారు. పోటీల్లో పాల్గొనేవారు గొప్ప లక్ష్యంతో అడుగేయాలి” అని తెలిపింది.