
- 2023లో ముంబైలో తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు
- భారత్ ఖాతాలో అత్యధికంగా ఆరుగురికి మిస్ వరల్డ్ టైటిల్స్
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 60 ఏండ్ల చరిత్ర ఉంది. తొలిసారిగా 1951లో బ్రిటన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొని టైటిల్ కైవసం చేసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు పోటీపడుతుంటాయి. లండన్‌కు చెందిన ఎరిక్ డాగ్లస్ మోర్లే అనే టెలివిజన్ హోస్ట్ 1951లో ‘ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్’ వేడుకల్లో భాగంగా స్విమ్ సూట్ కాంటెస్ట్ ఏర్పాటు చేశారు. అదే ‘మిస్ వరల్డ్’ పేరుతో ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఆ పేరును రిజిస్టర్ చేయించి పోటీలను నిర్వహిస్తున్నారు.
కాగా, 1972లో ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ కార్యక్రమాన్ని జూలియా మోర్లే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దాతల ద్వారా సేకరించిన ఫండ్స్‌ను పిల్లలు, మహిళల చదువు, ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, మిస్ వరల్డ్ కావాలనే లక్ష్యంతో జాతీయ స్థాయిలో ఏటా 10 లక్షలకు పైగా యువతులు పోటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏటా వరల్డ్ వైడ్‌గా 140 దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటుండటం విశేషం.
మన దేశంలో మూడోసారి పోటీలు..
మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇది మూడోసారి కాగా, తెలంగాణలో నిర్వహించడం ఇదే మొదటిసారి. దీంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మనదేశంలో మిస్ వరల్డ్ పోటీలు తొలిసారిగా 1996లో బెంగళూరులో నిర్వహించారు. తర్వాత 2023లో ముంబైలో నిర్వహించగా, తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్నాయి.
కొవిడ్ కారణంగా పోటీలు రద్దు..
1951లో ప్రారంభమైన అందాల పోటీలు ఇప్పటివరకు ఎప్పుడు అంతరాయం కలగలేదు. అయితే, కొవిడ్ 19 కారణంగా 2020 మిస్ వరల్డ్ పోటీలు రద్దయ్యాయి. జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ ఎక్కువ కాలం మిస్ వరల్డ్‌గా కొనసాగారు. 2019లో టైటిల్ గెలుచుకుని 2021 వరకు ఆమె మిస్ వరల్డ్‌గా ఉన్నారు. కొవిడ్-19 కారణంగా 2020 మిస్ వరల్డ్ రద్దు కావడంతో ఆమెకు ఈ చాన్స్ దక్కింది. ఇక వెస్ట్ జర్మనీకి చెందిన గబ్రీల్లా బ్రమ్ మిస్ వరల్డ్‌గా అతి తక్కువ కాలం కొనసాగారు.
ఆమె మిస్ వరల్డ్ టెటిల్ గెలుచుకున్న 18 గంటలకే రిజైన్ చేసింది. కాగా, భారత్, వెనెజులా అత్యధిక మిస్ వరల్డ్ టైటిళ్లు గెలుచుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరుసార్లు టైటిళ్లు గెలుచుకున్నాయి. మనదేశం నుంచి రీతా ఫారియా పావెల్, ఐశ్వర్యరాయ్, డయానా హేడెన్, యుక్తాముఖి, ప్రియాం కచోప్రా, మానుషి చిల్లర్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. మనదేశం నుంచి రెండో మిస్ వరల్డ్‌గా ఐశ్వర్యారాయ్ ఎంపికయ్యారు.