పార్లమెంట్​ ఓపెనింగ్​కు పోమనడం చారిత్రక తప్పిదమే..!

పార్లమెంట్​ ఓపెనింగ్​కు పోమనడం చారిత్రక తప్పిదమే..!

వలస పాలన నుంచి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఎదుర్కొని అనేక చారిత్రక మైలురాళ్లకు సాక్ష్యంగా నిలిచిన మన పార్లమెంటులో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క శక్తి వ్యక్తమవుతుంది. భారతదేశంలోని ప్రస్తుత పార్లమెంట్ హౌస్ అనేది బ్రిటిష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్ , హెర్బర్ట్ బేకర్చే రూపొందించబడిన వలసరాజ్యాల కాలం నాటి భవనం, ఆధునిక పార్లమెంటు ఉద్దేశ్యానికి అనుగుణంగా భవనాన్ని చాలా వరకు పలు మార్లు సవరించాల్సి వచ్చింది. 2026 తర్వాత గణనీయంగా పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పెరిగే సంఖ్యకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలతో రక్షణ ఏర్పాట్లతో కొత్త పార్లమెంటు భవనం అవసరం ఉంది. వందేళ్ల నాటి భవనము అనేక మరమ్మతుల ద్వారా చాలా వరకు క్షీణించి రక్షణకు ఏ మాత్రం ఉపయోగపడే విధంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. ప్రజల ఆకాంక్ష మేరకు నూతన పార్లమెంటు భవన సముదాయ ప్రారంభోత్సవానికి  హాజరు కాకుండా ప్రతిపక్షాలు ఓవైపు చేస్తున్న అనవసరపు ఆరోపణలు, మరోవైపు రాష్ట్రపతి పై ఆవకాశవాద ప్రేమను ఒలకబోస్తున్నారు. గతంలో అదే గిరిజన రాష్ట్రపతిపై  అగ్రవర్ణ వ్యక్తులను పోటీకి నిలబెట్టిన విషయాన్ని ప్రతిపక్షాలు మరిచిపోయాయా?

రాష్ట్రపతిపై ప్రతిపక్షాల ప్రేమ నిజమైనదెనా ? 

ప్రధానమంత్రి పార్లమెంటు భవన సముదాయాన్ని ప్రారంభిస్తే ప్రతిపక్షాలకు జరిగే నష్టం ఏమిటి ? రాష్ట్రపతి మాత్రమే  ప్రారంభించాలని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలకు  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఇంతటి ప్రేమ  ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అర్థం కావటం లేదు.   రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆమె గిరిజన మహిళగా గుర్తుకు రాలేదు!  సాక్షాత్ గిరిజన మహిళపై అగ్రవర్ణ వ్యక్తిని పోటీకి నిలిపి, దేశమంతటా తిరిగిన విషయం అంత తొందరగా ఎలా మర్చిపోయారు ?  ఆనాడు లేని ప్రేమ ఈనాడు ఎందుకు వస్తుందో ప్రతిపక్ష నాయకులే ప్రజలకు  సంజాయిషీ  ఇవ్వాలి.  ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తిగత రాగ ద్వేషాలు,  భారత ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచివి కావు, అధికార పార్టీ విధి విధానాలపై పోరాటాలు లేకుండా వ్యక్తిగతంగా వ్యతిరేకించడం  ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా ? 


ప్రజాస్వామ్యంలో ఎవరు అధినేత ? 


మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం, అధ్యక్ష తరహా  దేశం కాదనే  లాజిక్కును ప్రతిపక్షాలు ఎలా మరిచిపోయాయి? ప్రజల సార్వభౌమాధికారాన్ని  వ్యక్తపరిచేది కేవలం పార్లమెంటు మాత్రమే. అలాంటి  పార్లమెంటుకు అధినేత ప్రధానమంత్రి అవుతాడు.  పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి వ్యక్తి,  డైరెక్ట్ గా ప్రజల ద్వారా ఎన్నికై పార్లమెంటు సభ్యుల బలంతో ఎన్నికయ్యే నాయకుడు ప్రధానమంత్రి. ప్రజాస్వామ్యంలో  ఆన్ని నిర్ణయాలు, శాసనాలు తీసుకునేది కేవలం పార్లమెంటు మాత్రమే. ఆ పార్లమెంటుకు అధినాయకుడు ప్రధానమంత్రియే కదా !  అలాంటి అధినేత  కాకుండా ఇంకెవరు పార్లమెంటును ప్రారంభిస్తారు ? 

తెలంగాణ సచివాలయం 

తెలంగాణ రాష్ట్రంలో  కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం  ప్రారంభించినప్పుడు కూడ  గవర్నర్ ను గౌరవ అతిథిగా పిలవకపోవడం తప్పే. అయితే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రారంభించడం ముమ్మాటికి సముచితమే. దేశంలో ప్రధానమంత్రి ఎలాగో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా  అలాంటి హోదా కలిగిన వ్యక్తి అనే విషయాన్ని మర్చిపోవద్దు.  ప్రజలచేత ఎన్నుకొనబడ్డ నాయకుడే దేనికైనా బాధ్యత వహిస్తాడు. ఆ వ్యక్తి  రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలో ప్రధానమంత్రి.  తెలంగాణ సీఎం ప్రతిపక్షాలతో గొంతు కలుపుతాడా లేదా ఇంకా చెప్పలేదు. ఎందుకంటే తెలంగాణ సెక్రటేరియెట్​ ప్రారంభోత్సవానికి కనీసం గవర్నర్​కు ఆహ్వానం కూడా పంపని సీఎం కేసీఆర్​ ఇపుడు ప్రతిపక్షాలతో గొంతు కలపడం ఇబ్బందికరమే కదా? నేడు ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను  గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత రాగద్వేషాలను హైలెట్ చేయడం, ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం అస్త్రంగా మార్చుకోవడం సరికాదు. ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణిస్తూ.. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్‌‌ సహా 19 ప్రతిపక్ష పార్టీలు -ప్రజాస్వామ్య ఆత్మ పార్లమెంటులో లేనప్పుడు  కొత్త భవనానికి విలువ లేదని ఒక ఉమ్మడి ప్రకటన ఇచ్చాయి. ఇది భవిష్యత్ తరాలకు చెడు సాంప్రదాయంగా మారే అవకాశం ఉంది.  ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఆలోచించాలి.

ప్రజా సమస్యలను వదిలేసి..

ప్రతిపక్షాలు మోడీని ఎదుర్కోవడంలో చాలా సార్లు లాజిక్ ను  మిస్ అవుతున్నాయి. పార్లమెంట్ భవనం ప్రారంభం చేసే విషయంలో మెజారిటీ ప్రతిపక్షాలు చేస్తున్న రగడ అంతా ఇంతా కాదు.  మోడీ విధానాలు, ఇతరత్రా సమస్యలను ఎదుర్కోవడానికి పోరాటాలు చేయాల్సిన ప్రతిపక్షాలు ప్రజలకు ఏమాత్రం సంబంధంలేని విషయాలపై సమైక్యత ప్రదర్శించడంలో మతలబు ఏమిటి?  ఇలా అనవసర రాద్ధాంతం చేసిన ప్రతి సందర్భంలో  ప్రధాని  మోడీ ఎక్కువగా లాభబడ్డ సందర్భాలు అనేకం. ప్రతిపక్షాలు మోడీని వ్యక్తిగతంగా విమర్శించడంలో మాత్రమే యూనిటీగా ఉంటారా? దేశంలో ఎన్నో సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాటి మీద పోరాటం చేయరా? 

డా. బి కేశవులు