
- మిషన్ భగీరథ కోసం 80 వెహికల్స్ లీజుకు
- 8 నెలలుగా పైసలు చెల్లించని కాంట్రాక్టర్ ‘మాక్స్ ఇన్ ఫ్రా’ కంపెనీ
- బకాయిలు రెండున్నర కోట్లు
- బిల్లులు అడిగితే బెదిరిస్తున్నారని యజమానుల ఆవేదన
కరీంనగర్, తిమ్మాపూర్, వెలుగు: ‘‘మిషన్ భగీరథ పనులకు మా వెహికల్స్‌ను వాడుకున్నరు. ఏడెనిమిది నెలల నుంచి పైసలిస్తలేరు. బిల్లులడిగితే బెదిరిస్తున్నరు. రూ.రెండున్నర కోట్ల పైనే ఇయ్యాలె. మా బతుకులు ఏం గావాలె. మాకు రావాల్సిన పైసలు మాకియ్యాలె. లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటం”.. అని డిమాండ్ చేస్తూ వాహనాల యజమానులు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సోమవారం జరిగిందీ ఘటన. mission bhagiratha owners protest that vehicles bills not paid for 8 months
80 వెహికల్స్.. రూ. 2.65 కోట్ల బకాయిలు
తిమ్మాపూర్‍లోని ఎల్‍ఎండీ కాలనీలో 125 ఎంఎల్‍డీ సామర్థ్యమున్న ట్యాంకును మిషన్ భగీరథ పథకం కోసం నిర్మించారు. ఇక్కడ ‘మాక్స్ ఇన్ ఫ్రా’ కంపెనీ పనులు చేపట్టింది. ట్యాంకు నిర్మాణంతోపాటు ఇక్కడ అధికారులకు కావల్సిన భవనాలు, ప్రాజెక్టు భవనాలు, నీటిని నిల్వ చేసే ట్యాంకు కాంపౌండ్ వాల్స్, సపోర్టు భవనాలు, ఇతర నిర్మాణ పనుల కోసం కొన్ని వాహనాలను లీజుకు తీసుకున్నారు. సుమారు 60 మంది యజమానులకు చెందిన ట్రాక్టర్లు, డోజర్లు, జేసీబీలు, బొలేరో వంటి 80 వాహనాలు ఉన్నాయి. వీరికి ప్రతి మూడు నెలలకోసారి పేమెంట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి రోజుల్లో బాగానే ఇచ్చినా తర్వాత మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇలా ఏడు నెలల నుంచి బిల్లులు రాలేదు. దీంతో వాహనాల యజమానులు నరకయాతన అనుభవిస్తున్నారు. ‘‘సుమారుగా రూ.2.65 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. డీజిల్, డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. వాహనాలను ఫైనాన్స్ లో తీసుకురావడంతో కిస్తీలు కట్టడం కూడా ఇబ్బందిగా మారింది” అని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉండే వాహన యాజమానులంతా ఏకమై వచ్చారు. మిషన్ భగీరథ ట్యాంకుపైకి ఎక్కి నిరసన తెలిపారు. వీరిలో శంకరపట్నానికి చెందిన అందె హనుమంతు అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడున్న వారు అడ్డుకున్నారు.
మూడు నెలల బిల్లులిచ్చేందుకు ఓకే
ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు పైసలివ్వలేదని, తనకు రూ. 8 లక్షలు కంపెనీ నుంచి రావాల్సి ఉందని జనగామ జిల్లా జి.తమ్మడపల్లికి చెందిన సింగర్ వేణి రాజు చెప్పాడు. ట్రాక్టర్‌ను లీజుకు ఇచ్చానని, డబ్బులడిగితే బెదిరిస్తున్నారని హుస్నాబాద్‌కు చెందిన లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా కనికరించడంలేదని, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని శంకరపట్నానికి చెందిన అందె హనుమంతు చెప్పాడు. అప్పులు తెచ్చిన కాడ పరువు పోతోందని, 8 నెలల పైసలివ్వకుంటే చస్తానన్నాడు. ఈ క్రమంలో మిషన్ భగీరథ డీఈ త్రినాథ్.. ట్యాంకుపైకి ఎక్కి వాహన యాజమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు మీడియాలో వీరి నిరసన ప్రసారం కావడంతో కంపెనీ ప్రతినిధులు స్పందించారు.