
- మిషన్ భగీరథ పంప్ హౌస్కు తాళం వేసి సిబ్బంది ధర్నా
- భూపాలపల్లి జిల్లాలో 3 మండలాల్లో నీటి సరఫరా బంద్
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మిషన్‌భగీరథ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని మిషన్‌భగీరథ పంప్ హౌస్ ద్వారా వెళ్లే పైపులైన్ ను బంద్ చేసి గేటుకు తాళం వేసి ధర్నాకు దిగారు. పంప్ హౌస్పరిధిలో ములుగు(72), వెంకటాపూర్(54), గోవిందరావుపేట(45) మండలాల్లోని 171 ఆవాస గ్రామాల్లో తాగునీటి సరఫరా చేస్తున్నారు.
150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల చివర వారమైనా ఇంకా వేతనాలు చెల్లించలేదు. దీంతో నాలుగు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. దీంతో 3 మండలాలకు తాగునీటి సరఫరా బంద్ అయింది. తమకు వేతనాలు ఇవ్వాలని గతంలోనే అధికారులు, కాంట్రాక్టర్లకు వినతిపత్రం అందజేసినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. దసరా సమీపించడంతో కుటుంబాలకు కొత్తబట్టలైన కొనుక్కోవద్దా అంటూ కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. అధికారులు స్పందించి జీతాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి స్పందిస్తూ.. విడతల వారీగా సిబ్బందికి వేతనాలు చెల్లిస్తామని తెలియజేశామని, దీంతో ఆందోళన విరమించినట్లు తెలిపారు. సిబ్బంది ధర్మతేజ, పవన్, సుమన్, రాజు, ప్రకాష్, దేవేందర్ పాల్గొన్నారు.