కాంగ్రెస్​ సర్పంచ్ ​అని ఊరికి భగీరథ నీళ్లిస్తలే..

కాంగ్రెస్​ సర్పంచ్ ​అని ఊరికి భగీరథ నీళ్లిస్తలే..
  • కాంగ్రెస్​ సర్పంచ్ ​అని ఊరికి భగీరథ నీళ్లిస్తలే..
  • రెండు ట్యాంకులు కట్టినా వాటర్​ కనెక్షన్​ ఇయ్యలే..
  • ఏడాదిగా ఆఫీసర్ల తీరుతో  విసిగిపోయిన సర్పంచ్, గ్రామస్తులు 
  • పెద్దపల్లి జిల్లా బామ్లానాయక్​తండాలో వాటర్​ ట్యాంక్​ఎక్కి నిరసన

పెద్దపల్లి, వెలుగు:  సర్పంచ్​గా  కాంగ్రెస్​ లీడర్​ను ఎన్నుకోవడమే ఆ గ్రామస్తులు చేసిన పాపమైంది. చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకు భగీరథ నీళ్లు వస్తున్నా ఆ ఊరికి మాత్రం రావడం లేదు.  భగీరథలో భాగంగా ఐదేండ్ల కింద ఒక ట్యాంకు, ఏడాది కింద మరో ట్యాంకు కట్టినా ఇంట్రా పైపులైన్​కు కనెక్షన్​ ఇవ్వకపోవడంతో నల్లా నీళ్లు రావట్లేదు. దీంతో గొంతు తడుపుకునేందుకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లానాయక్​ తండావాసులు కష్టాలుపడ్తున్నారు. ఏడాదిగా ఆఫీసర్ల తీరుతో విసిగిపోయిన సర్పంచ్​, పాలకవర్గ సభ్యులు ఆదివారం మిషన్​భగీరథ వాటర్​ ట్యాంక్​ఎక్కి నిరసన తెలిపారు. కేవలం కాంగ్రెస్ ​లీడర్​ను కావడం వల్లే  తమ గ్రామానికి నీళ్లివ్వకుండా వేధిస్తున్నారని సర్పంచ్ ​ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. 

గోస తీరేదెన్నడు? 

2017 సంవత్సరంలో రూపొందించిన డీపీఆర్​కు అనుగుణంగా బామ్లానాయక్ తండాలో ట్యాంక్​ నిర్మించారు. దీనికి గ్రామస్తులే తమ భూమిని దానం ఇచ్చారు. పల్లపు ప్రాంతంలో ట్యాంక్​కట్టడంతో గ్రామంలోని చాలా వాడలకు నీరు ఎక్కడం లేదు. దీంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు  సీఎంఓ  కార్యదర్శి స్మితా సబర్వాల్​ రూ.16 లక్షలు విడుదల చేస్తూ  మరో ట్యాంక్​ నిర్మాణానికి అనుమతిచ్చారు. ఈ ట్యాంక్​ నిర్మాణం కూడా గత ఏడాదే పూర్తయ్యింది. కానీ, అధికారులు మాత్రం ఇంట్రా పైప్​లైన్​ కనెక్షన్​ ఇవ్వడంలేదు. దీంతో ఊరికి దూరంగా ఉన్న బోరింగుల నుంచి గ్రామస్తులు నీళ్లు తెచ్చుకుంటున్నారు. సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదు. అడిగితే పైపులైన్​వేయాల్సి ఉందని, వాటికి  నిధులు లేకపోవడంతో పనులు ఆగిపోయాయని చెబుతున్నారు.  

కాంగ్రెస్​ సర్పంచ్​ అనేనా? 

బామ్లానాయక్ తండా సర్పంచ్​రాజు నాయక్​ కాంగ్రెస్​ పార్టీకి చెందినవారు. 2019లో తండా గ్రామ పంచాయతీగా ఏర్పడగా ఎన్నికల్లో రాజు నాయక్​ సర్పంచ్​గా గెలుపొందారు. అప్పటినుంచే తమ గ్రామాభివృద్ధిని పట్టించుకోవడం లేదని రాజునాయక్​ ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు తమ గ్రామ పంచాయతీకి పక్కా బిల్డింగ్​ లేదని, దీంతో చెట్ల కిందనే సమావేశాలు పెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమైన తాగునీటి సమస్యను కూడా పరిష్కరించడం లేదంటున్నారు. రెండు ట్యాంకులు నిర్మించినా ఇప్పటివరకు నీళ్లివ్వలేదని ఆరోపిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ అనే వివక్ష  

గ్రామంలో సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకుంటలేరు. తాగునీరు సరఫరా చేయాలని యేండ్ల తరబడి అడుగుతున్నా. ట్యాంకులు నిర్మించినా కనెక్షన్​ ఇవ్వడానికి సతాయిస్తున్నారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్​ విషయంలోనూ వివక్షే. కాంగ్రెస్​ పార్టీకి చెందిన సర్పంచ్​ను కాబట్టే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా చేస్తున్నరు. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం వారం రోజుల్లో నీళ్లియ్యకపోతే జిల్లా కేంద్రంలోని భగీరథ ఆఫీసును ముట్టడిస్తాం. 
– రాజు నాయక్, సర్పంచ్,  బామ్లానాయక్​తండా, పెద్దపల్లి జిల్లా

వారం, పది రోజుల్లో నీళ్లందిస్తాం

వారం, పదిరోజుల్లో బామ్లానాయక్​ తండాకు తాగునీరందిస్తాం. గతంలో మిషన్​ భగీరథ కింద నీరందించడానికి ఏర్పాటు చేసిన డీపీఆర్​కు అనుగుణంగా పనులు పూర్తి కాలేదు. మిగిలిన పనుల కోసం నిధులు శాంక్షన్​ చేయాలని ప్రభుత్వానికి నివేదించాం. మిగిలిపోయిన పనులను వారం రోజుల్లో పూర్తిచేసి గ్రామానికి నీళ్లందిస్తాం.  

- గంగాధర శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్, మిషన్​భగీరథ, పెద్దపల్లి జిల్లా

ట్యాంకు ఎక్కిన పాలకవర్గం

తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆదివారం సర్పంచ్​ రాజునాయక్​, పాలకవర్గ సభ్యులు మిషన్​ భగీరథ వాటర్​ ట్యాంక్ ​ఎక్కి నిరసన తెలిపారు. మరోవైపు తండావాసులు ట్యాంకు కింద బిందెలతో ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు మక్కాన్​సింగ్​ తండాకు వచ్చి సర్పంచ్​, పాలకవర్గం, తండావాసులతో మాట్లాడారు. అధికారులకు ఫోన్ చేశారు. వారం రోజుల్లో తండాకు తాగునీరందేలా చర్యలు తీసుకుంటామని భగీరథ ఎస్ఈ అమరేంద్ర హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన సర్పంచ్​, ఉప సర్పంచ్​ ఇస్లావత్ తిరుపతి, వార్డు వార్డు సభ్యులు జైపాల్,  సామ్యూల్​, సన్నీ, రాజు నాయక్, రాజేశ్​ కిందికి దిగారు.