IPL 2024: పేరేమో ఇండియన్ లీగ్.. డబ్బేమో విదేశీయులకు.. ఐపీఎల్ ఫ్రాంచైజీలపై విమర్శలు

IPL 2024: పేరేమో ఇండియన్ లీగ్.. డబ్బేమో విదేశీయులకు.. ఐపీఎల్ ఫ్రాంచైజీలపై విమర్శలు

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ కు పేరుంది. ఐపీఎల్ అంటే భారత ఆటగాళ్లదే హవా. మన ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే కారణంగా తుది జట్టులో ఏడుగురు భారత ఆటగాళ్లు ఖచ్చితంగా ఉండాలనే రూల్ తీసుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. విదేశీ ఆటగాళ్లకు కనక వర్షం కురిపించడం ఇండియన్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చటం లేదు. నిన్న జరిగిన మినీ వేలంలో ఫారెన్ ప్లేయర్ల మీద కోట్లకు కోట్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మితీ మీరి డబ్బులు విదేశీయులకు ఇచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

నిన్న (డిసెంబర్ 19) జరిగిన మినీ వేలంలో స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. మరో పేసర్ కమిన్స్ ను 20.50 కోట్లకు సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. ఇది తెలుసుకున్న క్రికెట్ ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్, బుమ్రా కన్నా వీరికి ఎక్కువ ఇవ్వడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. పలువురు భారత దిగ్గజాలు సైతం విదేశీ ప్లేయర్లకు కోట్లు కుమ్మరించి వారిని హైలెట్ చేశారని వాపోతున్నారు. 

టీమిండియా స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్, బుమ్రా, ధోనీ, హార్దిక్, పంత్,రాహుల్ కు ఆయా ఫ్రాంచైజీలు ఒక సీజన్ కు 15 కోట్లు అందజేస్తున్నాయి. కానీ స్టార్క్, కమ్మిన్స్ కు మాత్రం ఏకంగా 20 కోట్లకు పైగానే ఇవ్వడానికి ముందుకొచ్చారు. గతేడాది వీరిద్దరూ ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. జాతీయ జట్టు ముఖ్యమని ఐపీఎల్ వదిలేశారు. అయినప్పటికీ వీరిద్దరి కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చుపెట్టడం కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. 

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ కు 18.50 కోట్లు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రీన్ కు 17 కోట్లు, డారిల్ మిచెల్ కు 14 కోట్లు ఇస్తున్నారు. మన స్టార్ ఆల్ రౌండర్ జడేజా, హార్దిక్ పాండ్యాలకు 15 కోట్లు ఇస్తుంటే..వీరు  మాత్రం అంతకు మించి అందుకుంటున్నారు. మన స్టార్ బౌలర్ బుమ్రా 15 కోట్లు ఇస్తుంటే కమ్మిన్స్, స్టార్క్ ధర మాత్రం 20 కోట్లు దాటిపోయింది. మొత్తానికి పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా డిమాండ్ మాత్రం విదేశీయులకే ఉంది.