
వరల్డ్‌కప్ కోసం బ్యాటింగ్ మెరుగుపర్చుకుంటున్నా
కోచ్ చెప్పినట్టు ఆడతా..
ఇండియా విమెన్స్ టెస్ట్, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్
ఓస్టర్ : 22 ఏళ్ల లాంగ్ కెరీర్.. ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డులు.. విమెన్స్ క్రికెట్‌లో మకుటం లేని మహారాణి. మిథాలీ రాజ్ గురించి ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. వయసు మీదపడుతున్నా... నేటితరం బ్యాట్స్‌విమెన్‌తో పోటీపడి పరుగులు చేస్తున్న మిథాలీ... ఇంటర్నేషనల్ లెవెల్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా శనివారం రికార్డు సృష్టించింది. అయినా, ఇప్పటికీ తనలో పరుగుల దాహం తీరలేదని అంటోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ కోసం తన బ్యాటింగ్‌ను మరింత మెరుగుపర్చుకుంటున్నానని తెలిపింది. 1999 జూన్ 26న ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ.. ఇంగ్లండ్‌తో మూడో వన్డే ముగిసిన తర్వాత జరిగిన కాన్ఫరెన్స్‌లో తన కెరీర్‌తోపాటు పలు అంశాలపై మాట్లాడింది. ‘క్రికెటర్‌గా నా ప్రయాణం సాఫీగా జరగలేదు. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో సవాళ్లు, మరెన్నో పరీక్షలు ఎదుర్కొన్నా. అయితే ప్రతీ పరీక్ష వెనుక ఓ కారణం ఉంటుందనేది నా నమ్మకం. దానివల్లే ఇక్కడిదాకా వచ్చా. వేర్వేరు కారణాల వల్ల చాలా సార్లు ఆటను వదలేద్దామనే అనుకున్నా. కానీ ఏదో తెలియని శక్తి నన్ను వెనకడుగు వేయనీకుండా క్రికెటర్‌గా కొనసాగేలా చేస్తోంది. 22 ఏళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఉన్నా... ఇప్పటికీ పరుగులు తీయాలనే దాహం నాలో తీరలేదు. ఫీల్డ్‌లోకి వెళ్లాలి, ఇండియాను గెలిపించాలనే పట్టుదల, కసి ఇప్పటికీ నాలో ఉన్నాయి. నా బ్యాటింగ్‌ను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని నాకూ తెలుసు. ప్రస్తుతం ఆ అంశంపైనే దృష్టి పెట్టా. నా బ్యాటింగ్‌లో కొన్ని స్కిల్స్ చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. కొన్నేళ్లుగా బ్యాటింగ్ అనేది జట్టులో నా రోల్. బ్యాటింగ్ యూనిట్‌ను ముందుండి నడిపించడం నా బాధ్యతగా వస్తోంది. ఛేజింగ్‌లో వేరే బ్యాట్స్‌విమెన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించడం చాలా బాగా అనిపిస్తోంది. అలాంటి సందర్భాల్లో నేను గేమ్‌ను కంట్రోల్ చేస్తుంటాను. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అందరినీ మోటివేట్ చేస్తుంటా. యంగ్‌స్టర్స్‌కు కండీషన్స్‌ను, పరిస్థితిని అర్థమయ్యేలా వివరించి ఎలా ఆడాలో చెబుతుంటా. నిజానికి మొత్తం బ్యాటింగ్ లైనప్ అంతా నాపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల మిగిలిన వారిని గైడ్ చెయ్యాల్సిన పనిని కోచ్, మేనేజ్‌మెంట్ నాకే అప్పగించింది’ అని మిథాలీ వివరించింది.
విమర్శలు పట్టించుకోను..
స్ట్రయిక్‌రేట్ విషయంలో తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని మిథాలీ తేల్చిచెప్పింది. ‘ నా స్ట్రయిక్‌రేట్ విషయంలో వస్తున్న విమర్వలను నేనూ చూశా. కానీ నేను వాటిని పట్టించుకోను. జనాన్ని మెప్పిచడం కోసం ఆడాను. కోచ్ , మేనేజ్‌మెంట్ చెప్పినట్టు ఆడటమే నా పని.. నా ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది. టాప్‌ఆర్డర్ అంతా డగౌట్ చేరిన సందర్భంలో బ్యాటింగ్‌లో నేను చాలా కీలకం. నేను పరిస్థితి అర్థం చేసుకుని తర్వాతి వచ్చే బ్యాట్స్‌విమెన్‌ను గైడ్ చేయగలిగితేనే జట్టును విజయం దిశగా తీసుకువెళ్లగలగుతాను’ అని మిథాలీ రాజ్ వివరించింది.
స్నేహ్ రాణాకు మంచి ఫ్యూచర్ ఉంది..
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో తనతో కలిసి 50 రన్స్ కీలక పార్ట్‌నర్‌షిప్ చేసిన ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాకు మంచి ఫ్యూచర్ ఉందని మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. ‘థర్డ్ వన్డేలో స్నేహ్‌ది నాది కీలక పార్ట్‌నర్‌షిప్. ఈ విషయంలో స్నేహ్‌ను ప్రశంసించి తీరాల్సిందే. ఆ స్లాట్ కోసం ఎప్పట్నించో మేము మంచి ఆల్‌రౌండర్‌ను వెతుకుతున్నాం. బౌలింగ్‌తోపాటు భారీ షాట్స్ కొట్టే ప్లేయర్ కోసం చూశాం. స్నేహ్ ఆ ప్లేస్‌లో బాగా ఆడింది. ఆమె ఆడిన తీరు చూశాక మంచి ఫ్యూచర్ ఉందని అనిపించింది. పైగా మోడ్రన్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం కూడా పెరిగింది. ఇక, ఫామ్ కోల్పోవడం ఏ ప్లేయర్‌కైనా సహజం. అందువల్ల హర్మన్ ప్రీత్‌ను నిందించడానికి ఏమీ లేదు. త్వరలోనే టచ్‌లోకి వస్తుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా హర్మన్‌కు ఉంది. అందువల్ల టీమ్ నుంచి ఆమెకు సపోర్ట్ ఉంటుంది. జెమీమా విషయంలోనూ జట్టు అదే పని చేస్తుంది. లాస్ట్ వన్డే విజయాన్ని టీ20 సిరీస్‌లో కొనసాగిస్తాం’ అని మిథాలీ చెప్పుకొచ్చింది.