
మహిళల ఐపీఎల్‌ను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాదే ప్రారంభించాలని ఇండియా వన్డే టీమ్‌కెప్టెన్ మిథాలీ రాజ్ బీసీసీఐని కోరింది. ‘మహిళల ఐపీఎల్‌విషయంలో బీసీసీఐ సుదీర్ఘ కాలం వేచి చూడకూడదు. వచ్చే ఏడాదే లీగ్‌ప్రారంభించాలని కోరుతున్నా. నిబంధనల్లో చిన్న చిన్న మార్పులు చేసైనా చిన్నస్థాయి ఐపీఎల్ మొదలుపెట్టాలి. పురుషుల ఐపీఎల్‌లో తుది జట్టులో గరిష్టంగా నలుగురు ఫారిన్‌ప్లేయర్లకు అనుమతిస్తారు. మహిళల ఫస్ట్‌ఎడిషన్‌లో అవసరమైతే ఐదు లేదా ఆరుగురు విదేశీ క్రికెటర్లను ఆడించండి. డొమెస్టిక్ క్రికెట్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేరని నేను ఒప్పుకుంటా. కానీ, ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను ఏర్పాటు చేయడం కీలకం. బీసీసీఐ ఇప్పటికే నాలుగు జట్లను ఏర్పాటు చేసినందున కనీసం ఐదు లేదా ఆరు జట్లతో ముందుకెళ్లాలి. ఈ విషయంలో మనం ఎల్లవెళ్లలా ఎదురు చూడకూడదు. ఏదో ఒక టైమ్‌లో లీగ్‌ఆరంభం కావాల్సిందే. ఆ తర్వాత ప్రతి ఏడాదీ జట్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి. పురుషుల మాదిరిగా తుది జట్టులో ఫారిన్‌ప్లేయర్ల సంఖ్య నాలుగుకు తగ్గించాలి’ అని మిథాలీ అభిప్రాయపడింది. ఇక, టీ20 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన షెఫాలీ వర్మను వన్డే జట్టులోకి తీసుకోవాలని ఈ హైదరాబాదీ సూచించింది. వన్డేల్లో అవకాశం ఇవ్వకపోవడానికి ఆమె వయసు ప్రామాణికం కాకూడదు అని మిథాలీ అభిప్రాయపడింది.