బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: స్టాలిన్

బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: స్టాలిన్

 

  • సనాతన ధర్మం కుష్టులాంటిది..  డీఎంకే ఎంపీ  వివాదాస్పద కామెంట్లు
  • ఢిల్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ 
  • ఉదయనిధి ఏమన్నాడో తెలుసుకోకుండానే ప్రధాని స్పందించడం అన్యాయం: స్టాలిన్  
  • డీఎంకే ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది 
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివాదం: ఉదయనిధి

చెన్నై/బెంగళూరు:  ఓ వైపు సనాతన ధర్మంపై డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు అదే పార్టీ ఎంపీ ఎ.రాజా కూడా సనాతన ధర్మంపై వివాదాస్పద కామెంట్లతో మరోసారి దుమారం రేపారు. సనాతన ధర్మం హెచ్ఐవీ, కుష్టు వ్యాధులలాంటిదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విశ్వకర్మ యోజన స్కీమ్ ను వ్యతిరేకిస్తూ బుధవారం చెన్నైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాజా మాట్లాడారు. ‘‘సనాతన, విశ్వకర్మ యోజన వేర్వేరు కాదు. అవి రెండూ ఒక్కటే. సనాతన ధర్మంపై ఉదయనిధి చాలా సాఫ్ట్ గా కామెంట్ చేశారు.

 అది మలేరియా, డెంగీ లాంటిదని.. దాన్ని నిర్మూలించాలని చెప్పారు. కానీ ఆ రెండు వ్యాధులు సామాజిక రుగ్మతలు కాదు. నిజానికి సామాజిక రుగ్మతలైన హెచ్ఐవీ, కుష్టు వ్యాధులతో సనాతన ధర్మాన్ని పోల్చాలి. కుష్టు వ్యాధి అసహ్యకరంగా ఉంటుంది. హెచ్ఐవీ కూడా అంతే. సనాతన ధర్మాన్ని కూడా వీటిలాగే చూడాలి” అని అన్నారు. ‘‘సనాతన ధర్మంపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎవరినైనా తీసుకురండి. అది 10 లక్షల మంది గానీ, కోటి మంది గానీ లెక్క చేయను. వాళ్లు ఎలాంటి ఆయుధాలైనా తెచ్చుకోనివ్వండి. నేను పెరియార్, అంబేద్కర్ బుక్స్ తో వచ్చి ఢిల్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రులందరికీ జవాబు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: స్టాలిన్  

ఉదయనిధికి ఆయన తండ్రి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు పలికారు. తన కొడుకు మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదని, కొన్ని బీజేపీ అనుకూల శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అసలు ఉదయనిధి ఏం మాట్లాడాడో తెలుసుకోకుండానే ప్రధాని స్పందించడం అన్యాయమన్నారు. ‘‘కొందరు సనాతన ధర్మం పేరుతో ఇప్పటికీ మహిళలపై వివక్ష చూపుతున్నారు. మహిళలు జాబ్ చేయొద్దని, వితంతువులు మళ్లీ వివాహం చేసుకోవద్దని ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి సిద్ధాంతాలను నిర్మూలించాలనే ఉదయనిధి పిలుపునిచ్చాడు. కానీ ఉదయనిధి మారణహోమానికి పిలుపునిచ్చాడని ప్రచారం చేస్తున్నారు. అసలు ఉదయనిధి అలాంటి పదమే వాడలేదు” అని పేర్కొన్నారు.  ఉదయనిధి తల నరికితే రివార్డు ఇస్తానన్న పూజారిపై యూపీ  ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. 

అంగీ ఇడ్వాలన్నందుకు గుడిలోకి పోలేదు: సిద్ధరామయ్య 

కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా సంచలన కామెంట్లు చేశారు. కేరళ టెంపుల్ లోకి రావాలంటే, తనను షర్ట్ విప్పాలన్నారని చెప్పారు. గురువారం బెంగళూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడారు.  ‘‘గతంలో నేను కేరళ వెళ్లినప్పుడు ఓ టెంపుల్ కు వెళ్లాను. అయితే అంగీ విప్పేసి లోపలికి రావాలని నిర్వాహకులు చెప్పారు. దీంతో నేను టెంపుల్ లోపలికి వెళ్లలేదు. బయటి నుంచే మొక్కి వచ్చేశాను. అక్కడి నిర్వాహకులు  కొందరినే కావాలని షర్ట్ లు విప్పించారు” అని అన్నారు. 

లీగల్​గా ఎదుర్కొంటా: ఉదయనిధి స్టాలిన్ 

సనాతన ధర్మంపై తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసులను లీగల్ గా ఎదుర్కొంటానని గురువారం ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. తన కామెంట్లపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ‘‘ఈ తొమ్మిదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు. ఉన్నట్టుండి నోట్లు రద్దు చేశారు. గుడిసెలు కనిపించొద్దని గోడ కట్టారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కట్టి, అందులో సెంగోల్ ఏర్పాటు చేశారు. చైనా ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏం చేయలేకపోతున్నారు. దేశం పేరును కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నా కామెంట్లపై దుష్ప్రచారం చేస్తున్నారు” అని ఉదయనిధి ఫైర్ అయ్యారు. కాగా, తన తలపై రివార్డు ప్రకటించిన యూపీ పూజారిపై కేసులు పెట్టొద్దని, దిష్టిబొమ్మలు దహనం చేయొద్దని డీఎంకే పార్టీ క్యాడర్ కు ఉదయనిధి విజ్ఞప్తి చేశారు.