ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

అలంపూర్,వెలుగు: ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే అబ్రహం సూచించారు.  ఆదివారం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను  టెంపుల్‌‌‌‌ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,  అర్చకుడు ఆనంద్ శర్మ  పాల్గొన్నారు.

ఆస్పత్రి నిర్మాణాన్ని మార్చి కల్లా పూర్తి చేయాలి

100 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని మార్చి చివరికల్లా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అబ్రహం అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలో నిర్మిస్తున్న ఆస్పత్రి పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  సీఎం కేసీఆర్,  వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు  కృషితో ఆస్పత్రి మంజూరైందని, పనులు త్వరగా పూర్తిచేసి  అందుబాటులోకి తేవాలని 
సూచించారు. 

దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి:   నాగం జనార్దన్‌‌‌‌ రెడ్డి,  మల్లు రవి 

కందనూలు, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలపై దాడి చేసిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి డిమాండ్ చేశారు.  ఆదివారం డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ వంశీకృష్ణ, కార్యకర్తలతో కలిసి నాగర్ కర్నూల్‌‌‌‌ ఏఎస్పీ రమేశ్వర్‌‌‌‌‌‌‌‌కు  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ  బిజినేపల్లి మండలం శాయంపల్లి దగ్గర 2018లో శంకుస్థాపన చేసి నేటికీ పనులు మొదలుపెట్టని మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే దాడులు చేయడం దారుణమన్నారు.  పిడి గుద్దులతో విరుచుకు పడడమే కాదు సీనియర్ కార్యకర్త వాల్యా నాయక్ గొంతుపై కాలు పెట్టి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లురవి మాట్లాడుతూ ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, బాధ్యులపై  చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌‌‌‌ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌ రెడ్డితో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు రోహిణి, సుమిత్ర, అర్థం రవి, బిజినేపల్లి మండల నాయకులు సుహాసన్ రెడ్డి, పాషా, ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 


గ్రామాల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నరు:డీకే అరుణ

గద్వాల, వెలుగు: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం గద్వాల మండలం మేలచెర్వ్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆర్‌‌‌‌‌‌‌‌యూబీ వల్ల పడుతున్న ఇబ్బందులను ఆమెకు వివరించారు.  ఇదివరకు ఉన్న రైల్వే బ్రిడ్జి పక్క రోడ్డును బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు కబ్జా చేయడంతో ఎటూ పోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ.. రోడ్లను కబ్జా చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు కావాలనే అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  రెవెన్యూ ఆఫీసర్లు సర్వేచేసి పాత రోడ్డును ఓపెన్ చేయాలని,  అలాగే వర్షాకాలంలో ఆర్‌‌‌‌‌‌‌‌యూబీ వద్ద  నీళ్లు నిల్వ ఉండకుండా రైల్వే ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, నియోజవర్గ కన్వీనర్ రామాంజనేయులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, నేతలు త్యాగరాజు, వేణుగోపాల్ రెడ్డి, రజక నర్సింహులు   తదితరులు 
ఉన్నారు.


కోయిల్​సాగర్​ రైతులు ఏకమవ్వాలి: హర్షవర్దన్​ రెడ్డి

మరికల్​, వెలుగు: కోయిల్​సాగర్ లిఫ్ట్​ నుంచి ఇథనాల్ ​కంపెనీకి నీళ్లివ్వడం సరికాదని, ఆయకట్టు రైతులంతా ఏకమై పనులను అడ్డుకోవాలని టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు జి.హర్షవర్దన్​రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పెద్దచింతకుంటలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాకున్నా కంపెనీ పనులు చేయడమేంటని ప్రశ్నించారు.  చిత్తనూర్​, ఎక్లాస్​పూర్, కన్మనూర్, ​లింగంపల్లి గ్రామాల రైతులు ఉద్యమాలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.  అధికార పార్టీ నాయకులు, పోలీసులు  కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా మారరని విమర్శించారు. రైతుల పైపులు ధ్వంసం చేసి అక్రమంగా పైప్‌‌‌‌లైన్ వేస్తున్న కంపెనీని వదిలేసి పోరాటం చేస్తున్న రైతులపై కేసులు ఎలా పెడతారని నిలదీశారు.  జూరాల నుంచి కోయిల్​సాగర్​ ప్రాజెక్టుకు వచ్చే నీళ్లన్నీ సాగునీటికి వాడుకోవాలని రూల్‌‌‌‌ ఉన్నా..  దాదాపు టీఎంసీ నీటిని ఇథనాల్​ కంపెనీకి ఇవ్వడం ఏంటన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి వెంటనే పనులు ఆపాలని డిమాండ్ చేశారు.


మరోసారి పోటీ చేస్తా: మాజీ మంత్రి చిన్నారెడ్డి

వనపర్తి, వెలుగు:  వనపర్తి అసెంబ్లీ నుంచి తాను మరో సారి పోటీ చేస్తానని మాజీ మంత్రి, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు మద్దతుగా నిలవాలని కోరారు.  ఎవరెన్ని చేసినా తనకే పార్టీ టికెట్‌‌‌‌ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిఇంటికి తిరిగి జనాలను కలుస్తానని,  గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీసీసీ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ యాదవ్, నేతలు కిరణ్ కుమార్,  పల్లె పోగు ప్రశాంత్ కుమార్,   కోట్ల రవి, యాదయ్య, కృష్ణ వర్ధన్ రెడ్డి , కోఆర్డినేటర్ త్రినాథ్, దివాకర్ ,  రమేశ్,  చందర్, మధు గౌడ్, బాబా, వెంకటేశ్  తదితరులు పాల్గొన్నారు.