- .కార్యకర్తలకు ఎమ్మెల్యే జారే దిశానిర్దేశం
అశ్వారావుపేట, వెలుగు : గ్రూపు తగాదాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని వినాయకపురం గ్రామంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న 27 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సత్తా చాటాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అభ్యర్థులను కమిటీ నియమ నిబంధనలకు లోబడి ఎంపిక చేయాలని, ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను అందజేయాలని కోరారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల తో పాటు ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి తాను సొంతంగా మరో రూ. 10 లక్షలు గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, సొసైటీ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, నాయకులు జూపల్లి రమేశ్, తుమ్మ రాంబాబు, చెన్నకేశవరావు, వేముల భారతి, సత్యనారాయణ చౌదరి, ఆకుల శ్రీను, నరేశ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : మండలంలోని దామరచర్ల ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జారే మాట్లాడారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే అభ్యర్థుల గెలుపు తేలికవుతుందన్నారు. అభ్యర్థుల గెలుపు గ్రామాల అభివృద్ధికి బలమైన పునాదులుగా ఉంటాయని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కృష్ణారెడ్డి, భోజ్యానాయక్, సారేపల్లి శేఖర్, సురేశ్, రమణ, 14 పంచాయతీల కార్యకర్తలు పాల్గొన్నారు.
ములకలపల్లి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక మండల కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులదే బాధ్యత అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. పార్టీ ములకలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గాడి తిరుపతిరెడ్డి అధ్యక్షతన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక మండల సమన్వయ కమిటీ సభ్యులు జాగ్రత్తగా చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తాయన్నారు.
