మహంకాళి దేవాలయంపై సీఎంను కలిసిన అక్బరుద్దీన్

మహంకాళి దేవాలయంపై సీఎంను కలిసిన అక్బరుద్దీన్

హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు చాంద్రాయణగుట్ట MIM MLA అక్బరుద్దీన్ ఓవైసీ.  బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో సీఎంను కలిసి దీనిపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలు ఎంతో ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు అక్బరుద్దీన్. ఇలాంటి ఆలయానికి సరిపోయేంత స్థలం లేకపోవడంతో , దేవాలయ ప్రాంగణం అభివృద్ధి జరగలేదని వివరించారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని సీఎంకు వివరించారు. గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉందని చెప్పారు. ఇంత తక్కువ స్థలం ఉండడం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతుందని వివరించారు. దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలని కోరారు.  దేవాలయ విస్తరణతో పక్కనే ఉన్నవారు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉందన్నారు. వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వాలని సూచించారు. దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయడాన్ని అత్యంత ముఖ్యమైన పనిగా భావించాలని సీఎంను కోరారు అక్బరుద్దీన్.

మరోవైపు పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మసీద్ రిపేర్ల కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు అక్బరుద్దీన్. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని, మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అక్బరుద్దీన్ విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతుల కోసం వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం.

mla-akbaruddin-owaisi-meets-cm-kcr-on-mahankali-temple