పోడు పట్టాలు పంపిణీ చేయాలి..రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే మద్దతు

పోడు పట్టాలు పంపిణీ చేయాలి..రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే మద్దతు

నేరడిగొండ (ఇచ్చోడ), వెలుగు: పోడు రైతులకు వెంటనే పట్టాలను అందజేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు కొన్ని రోజులుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం, బాబ్జిపేట్ గ్రామాల పోడు రైతులు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు. శనివారం మొక్కలు నాటేందుకు గ్రామంలోకి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులతో మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దన్నారు. అయినా ఫారెస్ట్ ఆఫీసర్లు వినకపోవడంతో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కొద్దిసేపటికి అటవీ అధికారులు వెనక్కి వెళ్లిపోవడంతో ధర్నా విరమించారు. అమాయక పోడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని, వారి జోలికొస్తే ఎంతకైనా తెగిస్తానని అన్నారు. ప్రభుత్వం వెంటనే పోడు రైతులకు  పోడు పట్టాలను అందజేసి ఆదుకోవాలని కోరారు.

బోథ్ పేరు నిలబెట్టాలి 

చదువులో రాణించి బోథ్ నియోజకవర్గ పేరు నిలబెట్టాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇటీవల వెలువడిన లాసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎల్కూచి రుతికను శనివారం నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో శాలువాతో సన్మానించి అభినందించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం మండలంలోని పలు కాలనీల్లోని డ్రైనేజీ , సీసీ రోడ్లు , విద్యుత్ దీపాలు తదితర వాటిని పరిశీలించి వర్షాకాలం నేపథ్యంలో క్లోరినేషన్, బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలని పంచాయతీ ఆఫీసర్లను ఆదేశించారు. ఎమ్మార్వో ఖలీమ్, ఆర్ఐ నాగోరావు, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు .

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

బజార్ హత్నూర్, వెలుగు: బజార్​హత్నూర్ లోని రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, శాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. పేదింటి బిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మి పథకం గొప్ప వరమన్నారు. అనంతరం బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఎస్ బీఐ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. తహసీల్డార్​ శ్యాంసుందర్, మాజీ జడ్పీటీసీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.