ఖానాపూర్ రూపురేఖలు మారుస్తా : డీసీసీ ప్రెసిడెంట్ బొజ్జు పటేల్

ఖానాపూర్ రూపురేఖలు మారుస్తా : డీసీసీ ప్రెసిడెంట్ బొజ్జు పటేల్
  •     ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేలా ఇక్కడి ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ బొజ్జు పటేల్ అన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్​ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక కోర్టును ఆశ్రయించి పనులు జరిగేలా కృషి చేశానన్నారు. 

పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మటన్, చేపల మార్కెట్ లో పర్యటించి వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుమ్రం భీం చౌరస్తా వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

డీసీసీ అధ్యక్షుడికి సన్మానం

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొజ్జు పటేల్​ను ఖానాపూర్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్ట పడి పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజిద్,  మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్​లు చిన్నం సత్యం, కావలి సంతోష్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, నిమ్మల రమేశ్, ఆత్మ చైర్మన్ తోట సత్యం తదితరులున్నారు.