
ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ఖానాపూర్ నియోజవర్గంలోని అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు ఐరన్ బ్రిడ్జిల ఏర్పాటుకు అనుమతులివ్వాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖను, పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కోరారు. హైదరాబాద్లో వారిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయని, సరైన రోడ్డు మార్గాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉట్నూర్, పెంబి మండలాల్లో 6 ఐరన్ బ్రిడ్జిలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17.9 కోట్లు మంజూరు చేసిందని మంత్రికి తెలిపారు. బ్రిడ్జిల నిర్మాణానికి త్వరగా అనుమతులివ్వాలని కోరారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు వాడుతున్న ఇసుక విషయంలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఖానాపూర్, వెలుగు: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండలం కోలంగుడాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేదల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఇండ్లు నిర్మించి ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
స్వచ్ఛతను పాటిద్దాం
ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, బొజ్జు పటేల్ సూచించారు. స్వచ్ఛతాసీ సేవ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వచ్ఛత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఖానాపూర్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఆయా కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజిద్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, ఖానాపూర్ కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం, ఎన్ఎస్ఎస్ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ రెడ్డి, ఎంపీడీవో రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.